నటుడు ఆది పినిశెట్టి ఇటీవల వచ్చిన 'సరైనోడు, నిన్నుకోరి, అజ్ఞాతవాసి' మరీ ముఖ్యంగా 'రంగస్థలం' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకుల మదిలో సుస్ధిరస్థానం సంపాదించాడు. ఈయన సీనియర్ దర్శకుడు రవిరాజా పినిశెట్టి కుమారుడు. మెగాస్టార్ చిరంజీవి నుంచి దాదాపు అందరు స్టార్స్‌తో బ్లాక్‌బస్టర్స్‌ని ఆయన అందించాడు. మరీ ముఖ్యంగా 'చంటి, పెదరాయుడు'.. ఇలా రీమేక్ చిత్రాలను తీయాలంటే రవిరాజానే తీయాలనే పేరును తెచ్చుకుని మొత్తంగా 56చిత్రాలను డైరెక్ట్ చేశాడు. ఈయన మంచి ఫామ్‌లో ఉండగా చెన్నైలో ఉండేవాడు. అక్కడే ఆది పినిశెట్టి పుట్టి పెరిగాడు. ఇక ఈయన దాసరి నిర్మాతగా తేజ దర్శకత్వంలో వచ్చిన 'ఒక విచిత్రం' ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. తెలుగులో సరైన గుర్తింపు రాకపోవడంంతో కోలీవుడ్‌పై దృష్టి పెట్టాడు. ఆయన తమిళంలో నటించిన 'మృగం' చిత్రం ఒక సంచలనం, ఆ తర్వాత శంకర్ నిర్మాతగా రూపొందిన 'వైశాలి, వస్తాద్, చెలగాటం, ఏకవీర' వంటి చిత్రాలతో పాటు తెలుగులో 'గుండెల్లో గోదారి, మలుపు' వంటి మూవీస్ చేశాడు.
ప్రస్తుతం ఆయన విలన్, క్యారెక్టర్, సపోర్టింగ్ యాక్టర్‌గా నటిస్తున్నా కూడా ఇకపై హీరోగానే చిత్రాలు చేయాలని డిసైడ్ అయ్యాడు. అందులో భాగంగా ఆయన ఓ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన 'నీవెవరో' చిత్రంతో మరోసారి హీరోగా తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అందునా ఈ చిత్రాన్ని కోనవెంకట్ వంటి స్టార్ రైటర్ రచయితగా పనిచేస్తూ ఎంవివి సంస్థ భాగస్వామ్యంలో హరనాధ్ దర్శకత్వంలో ఈ మూవీని చేస్తుండటం విశేషం. ఈ చిత్రం టీజర్‌ని తాజాగా సుకుమార్ విడుదల చేశాడు. ఈ సందర్భంగా సుకుమార్ ఆది పినిశెట్టి గురించి మాట్లాడుతూ, 'రంగస్థలం' చిత్రం షూటింగ్‌లో నేను అసలు ఆదిని పట్టించుకోకుండా నెగ్లేట్ చేశాను. కానీ అది కావాలని చేసింది కాదు. ఏ సీన్‌ని అయినా తనదైన శైలిలో పండించే సత్తా ఉన్న నటునికి ఏమీ చెప్పనవసరం లేదని నా ఉద్దేశ్యం. ఇలా షూటింగ్‌లో నేను ఆదిని పట్టించుకోకపోవడంతో ఆయన అసిస్టెంట్ డైరెక్టర్ల వద్దకు వెళ్లి దర్శకుడు సుకుమార్ నాతో మాట్లాడటం లేదు. నా నటన ఆయనకు నచ్చలేదా? అని అడిగాడు.
ఇక ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి అంటే నాకెంతో ఇష్టం. రచయితగా ఉన్నప్పుడు ఆయన విలువ తెలియలేదు గానీ నేను దర్శకునిగా మారిన తర్వాత మాత్రం ఆయన గొప్పతనం నాకు తెలిసింది. 'నీవెవరో' చిత్రం ఖచ్చితంగా హిట్ అవుతుందని భావిస్తున్నాను. ఇక 'రంగస్థలం' చిత్రంలో కథ మొత్తం ఆది చుట్టూనే తిరుగుతుంది. దాంతో రామ్‌చరణ్ ఏమైనా ఫీలవుతాడేమోనని భావించాను. అదే విషయం చరణ్‌కి చెబితే, ఛ..ఛ అలాంటిదేం లేదు. కథ ప్రకారం ఆది క్యారెక్టర్ అలా ఉండాల్సిందేనని చెప్పారు. 'రంగస్థలం' హిట్‌లో ఆదిది కూడా కీలకపాత్ర అంటూ చెప్పుకొచ్చాడు సుకుమార్.