ఈమధ్య కాలంలో ఫ్యామిలీ అందరు కూర్చుని చూసే సకుటుంబ కధా చిత్రాలు అరుదుగా వస్తున్నాయి. తాజాగా వచ్చిన కార్తి 'చినబాబు' చిత్రం ఆలోటుని తీరుస్తోంది. పల్లెటూరి వాతావరణం, రైతు నేపధ్యం, కుటుంబం, బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, ఆప్యాయతల నేపధ్యంలో ఈ చిత్రం రూపొందింది. తాజాగా ఈ చిత్రం చూసిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దీనిపై ప్రశంసల వర్షం కురిపించారు. నిజానికి వెంకయ్యనాయుడుకు సినిమాలపై పెద్దగా అవగాహన లేకపోయినా తనకు నచ్చిన చిత్రాలు వస్తే వెంటనే బాగుందని చెబుతారు. ఈయన తెలుగు పౌరుషాన్ని చూపించిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' ఆడియో వేడుకకు కూడా ముఖ్యఅతిధిగా వచ్చారు. ఇక ఇటీవల ఎస్వీఆర్ గురించి కూడా గొప్పగా చెబుతూ, సినిమాలలో అసభ్యత, అశ్లీలత తగ్గించి, కాస్త సమాజానికి ఉపయోగపడే చిత్రాలు తీయాలని కోరాడు.
ఇక 'చినబాబు' చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్పందిస్తూ, వ్యవసాయ ప్రాధాన్యత, కుటుంబ జీవనం, పశుసంపద పట్ల ప్రేమ, ఆడపిల్లల మీద నెలకొన్న వివక్ష వంటి వాటి నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం హీరో కార్తి, నిర్మాత సూర్య, దర్శకుడు పాండిరాజ్‌లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవల కాలంలో నేను చూసిన మంచి చిత్రం 'చినబాబు'. అశ్లీలత, జుగుప్సా మచ్చుకైనా లేకుండా తీసిన చిత్రం. గ్రామీణ వాతావరణం, పద్దతులు, సాంప్రదాయాలు, పచ్చని పొలాలతో ఆహ్లాద భరితంగా రూపొందిన 'చినబాబు' సకుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం అని కొనియాడుతూ ట్వీట్ చేశాడు.
మరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రమోషన్ ఈ చిత్రానికి ఏమేరకు ఉపయోగపడుతుందో చూడాలి. ఎందుకంటే సినిమాలపై పెద్దగా మాట్లాడే అలవాటు లేని వెంకయ్యనే ఈ చిత్రం మెప్పించిందంటే దీనిని ప్రత్యేకంగానే భావించాలి.