'పెళ్లి చూపులు' సినిమా హిట్ అవగానే తరుణ్ భాస్కర్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. తరుణ్ కి ఇక పెద్ద హీరోల ఆఫర్స్ వెల్లువగా వచ్చి పడతాయని అన్నారు. అనడమేమిటి గత రెండేళ్లుగా అదే న్యూస్ ప్రచారం జరిగింది. కానీ తరుణ్ భాస్కర్ ఆలోచించి ఆలోచించి.. సురేష్ ప్రొడక్షన్స్ లో 'ఈ నగరానికి ఏమైంది' అంటూ కొత్తమొహాల్తో సినిమా చేసి హిట్ కొట్టలేకపోయాడు. ఇక మరో దర్శకుడు పరిస్థితి కూడా అంతే. దర్శకుడు సందీప్ వంగా 'అర్జున్ రెడ్డి' అనే సినిమాని తెరకెక్కించి మంచి హిట్ కొట్టాడు. పేరు తెచ్చుకున్నాడు. విజయ్ దేవరకొండ తో తెరకెక్కించిన ఈ సినిమా యూత్ఫుల్ ఎంటెర్టైనర్ గా అదరగొట్టే హిట్ కొట్టింది. ఆ దెబ్బకి సందీప్ వంగాకి పెద్ద స్టార్స్ మొత్తం శుభాకాంక్షలు తెలియజేసారు కూడా. ఇక సందీప్ వంగా పెద్ద స్టార్స్ అంటే ఎన్టీఆర్, మహేష్, రామ్ చరణ్ లతో తరుచు కలవడం.. సందీప్ కి వారితో సినిమాలు ఉంటాయనే ప్రచారం బాగా జరిగింది. ఇక మహేష్ తో సందీప్ వంగా సినిమా కన్ఫర్మ్ అంటున్నారు. కానీ ఎప్పుడో క్లారిటీ లేదు. ఇక సందీప్ వంగా, మహేష్ కోసం ఎన్నేళ్లు ఎదురు చూడాలో తెలియక తాను తెలుగులో డైరెక్ట్ చేసిన 'అర్జున్ రెడ్డి' ని బాలీవుడ్ షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు.
ఇక తాజాగా 'RX 100' సినిమాతో హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి పరిస్థితి కూడా అలానే ఉంది. ఆ సినిమా యూత్ ని టార్గెట్ చేసి తియ్యడం... సినిమాలో బోల్డ్ కంటెంట్, కిస్సులు, హాట్ హాట్ సన్నివేశాలతో కుర్రకారుని బాగా పడేసి... ఈ సినిమా యావరేజ్ టాక్ తో సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోయేలా చేసింది. నిర్మాతలకు ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టడంతో.. ఇప్పుడు మీడియం హీరోల చూపు అజయ్ భూపతి మీద పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. 'RX 100' సినిమా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కించి హిట్ కొట్టిన ఈ దర్శకుడిపై యంగ్ హీరోల చూపు పడిందంటూ ఫిలింసర్కిల్స్ లో గుసగుసలు వినబడుతుంది. మరి సందీప్ వంగాకి 'అర్జున్ రెడ్డి' సినిమాతో ఎంతగా పేరొచ్చిందో.. ఇపుడు 'RX 100' తో అజయ్ భూపతి కి అలానే గుర్తింపు వచ్చింది. మరి ఈ సినిమా దెబ్బకి అజయ్ కి అవకాశాలు క్యూ కట్టాయనే న్యూస్ లో ఎంత నిజముంది అనేది..... అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ పట్టాలెక్కితే గానీ క్లారిటీ రాదు. ఇకపోతే అజయ్ భూపతి ఇప్పటికే తన రెండో సినిమాకి స్క్రిప్ట్ వర్క్ లో బిజీగా ఉన్నాడనే టాక్ అయితే వినబడుతుంది. మరి ఆ కథ ఎవరి కోసం రెడీ చేస్తున్నాడో తెలియాల్సి వుంది.