ఇంతకాలం పవన్‌కళ్యాణ్ మాజీ భార్యగా పిలవబడే రేణుదేశాయ్ త్వరలో రెండో వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. భవిష్యత్తులో తనకే కాదు.. తన పిల్లలకు కూడా ఓ తోడు అవసరమని చెప్పి ఆమె తన ఆత్మాభిమానం కోసం పోరాడుతూ ఉంది. కానీ కొందరు పవన్ వీరాభిమానులు మాత్రం అది ఆమె వ్యక్తిగతమని భావించకుండా నానా రచ్చ చేస్తున్నారు. దాంతో తన సోషల్ మీడియా అకౌంట్లను మూసి వేసింది. దాంతో ఆమె అంటే గిట్టని కొందరు ఆమె తప్పు చేస్తోంది కాబట్టే భయపడుతోందని అంటున్నారు. కానీ రేణుదేశాయ్ మాత్రం తన గట్స్ ఏమిటో నిరూపించింది.
తాజాగా ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భావాలను వెల్లడించింది. మగాడు ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నా సమాజం ఆయనను సెలబ్రిటీగానే భావిస్తోంది. అదే పని మహిళలు చేస్తే తట్టుకోలేకపోతున్నారు. దురదృష్టవశాత్తు మనం పురుషాధిక్య సమాజంలో ఉన్నాం. కొంతమంది పురుషులు మాత్రమే మహిళలను మనుషులుగా గుర్తిస్తారు. మిగిలిన వారు ఆట బొమ్మలు అనుకుంటారు. ప్రతి మగాడు ప్రతి స్త్రీ మనకి దక్కాలనే ఆలోచనతో ఉంటున్నారు. భర్తని పేరు పెట్టి పిలిచినా ఈ సమాజం ఒప్పుకోవడం లేదు. మహిళల స్వేచ్చను రెండు కాళ్ల మధ్య దాచేసిని సమాజం మనది. ఆమెను ఓ వస్తువుగా చూస్తున్నారే గానీ మహిళగా చూడటం లేదు. మహిళలు పురుషుల కంటే కాస్త శారీరకంగా బలహీనులే కావచ్చు.
కానీ వారిని కూడా సమానంగా చూడటానికి ఎంత కాలం పడుతుందో అర్ధం కావడం లేదు. తమ కొడుకులను ప్రతి తల్లి జాగ్రత్తగా విలువలతో పెంచాల్సివుంది. వారికి స్త్రీ గొప్పతనాన్ని చెప్పాలి. అత్త తన అత్తతో కష్టాలు పడినప్పుడు ఆ అత్త కూడా తన కోడలిని అలాగే కష్టపెట్టాలని చూస్తుందే గానీ తనకు ఎదురైన కష్టాలు తన కోడలికి రాకూడదని భావించడం లేదు. మహిళలకు మహిళలే శత్రువు అనే విషయాన్ని కూడా మనం ఒప్పుకోవాలి. రేపు నా కుమారుడు ఎవరైనా యువతిని తప్పుగా భావిస్తే నేను నా కుమారుడి కోణంలో కాకుండా ఆ అమ్మాయి కోణంలో ఆలోచిస్తాను. నా అనుకున్న మనుషులు నన్ను బాధపెట్టినప్పుడు వారిని క్షమించాలని నిర్ణయించుకోవడమే నేను ఎదుర్కొన్న పెద్ద సమస్య. నా తల్లిదండ్రులు నేను అమ్మాయిగా పుట్టడం ఇష్టంలేక నన్ను బాధించడం, నా భర్తకి భార్యగా నేను సహనంగా ఉండటం అనేది నా జీవితంలో అతి కఠినమైన క్షణాలు అని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.