మనుషులకు నిజాయితీ ఉండాలని చాలా మంది సూక్తులు చెబుతూ ఉంటారు. కానీ అది చిన్ననాటి నుంచే అలవాటు కావాలి. అది పిల్లలలో పెంపొందించాలంటే ఎవరైనా నిజాయితీగా ఉన్నప్పుడు వారిని ప్రేమతో దగ్గరకు తీసి ప్రోత్సహించాలి. ఇప్పుడు ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అదే పని చేసి సెహభాష్ అనిపించుకున్నాడు.
ఇక విషయానికి వస్తే తమిళనాడు ఈరోడ్‌కి చెందిన బాలుడు మహ్మద్ యాసిన్ అనే బాలుడికి ఇటీవల రూ. 50వేలు దొరికాయి. వాటిని ఆ బాలుడు నేరుగా పోలీసులకు అప్పగించి మీడియాలో వార్తల్లో నిలిచి ఓవర్‌నైట్ స్టార్‌గా మారాడు. అందరు ఆ బాలుడి నిజాయితీని ప్రశంసిస్తూ ఉన్నారు. తాజాగా రజనీకాంత్ ఈ బాలుడిని తన ఇంటికి ఆహ్వానించాడు. ఆ బాలుడితో పాటు ఆ బాలుడి తల్లిదండ్రులతో కూడా రజనీ ముచ్చటించారు. అంతేకాదు.. ఇక ఆ బాలుడికి అయ్యే ఖర్చు మొత్తాన్ని తానే భర్తిస్తానని రజనీ ప్రకటించాడు. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ బాలుడి చదువు బాధ్యతలను రజనీకాంత్ తీసుకోవడం నిజంగా హర్షణీయం.
ఇక రజనీ విషయానికి వస్తే ఆయన త్వరలో రాజకీయ పార్టీని స్థాపించనున్నాడు. ప్రస్తుతం ఆయన '2.0' చిత్రంలో నటించాడు. ఈ చిత్రం నవంబర్ 29న విడుదల కానుంది. అదే సమయంలో రజనీ పిజ్జా ఫేం కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోన్న చిత్రంలో నటిస్తున్నాడు. ఆయన ఎన్నికల ఎంట్రీకి ముందు రజనీకి ఇదే చివరి చిత్రం అనే ప్రచారం జరుగుతోంది. మరి ఇది నిజమో కాదో తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయక తప్పదు.