ఎవరితోనైనా ఓ చిత్రం చేయాలని భావిస్తే అప్పటికి ఆ హీరోకి ఉన్న ఇమేజ్, క్రేజ్‌ని దృష్టిలో పెట్టుకుని హీరోలను, ఇతర నటీనటులను ఎంచుకోవాలి. ఎంత మంచి చిత్రమైనా సరైన సమయంలో రాకపోతే ఫ్లాప్ అవుతుంది. దీనికి నాటి నుంచి నేటివరకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మహేష్‌బాబు నటించిన 'నాని' చిత్రం దీనికి ఓ ఉదాహరణ. మహేష్‌కి ఉన్న క్రేజ్ వల్ల ఆ చిత్రం సరిగా ఆడలేదు.
ఇక 'అతడు' చిత్రం కూడా అనుకున్న విధంగా హిట్ కాకపోవడానికి కారణం కూడా రిలీజ్ టైమే. దీనిపై తాజాగా ఎన్నో చిత్రాలకు కథ, సంభాషణలు అందించి, ఎంతో అనుభవం కలిగి, ఆ కథ, ఏ పాత్ర, ఏ హీరోకి సూట్ అవుతుందని జడ్జి చేయగలిగిన సీనియర్ రైటర్‌గా పరుచూరి గోపాలకృష్ణకి పేరుంది. ఆయన తాజాగా మాట్లాడుతూ, త్రివిక్రమ్ ద్వారా తేజ నాకు 'నిజం' కథను వినిపించాడు. స్టోరీ బాగుంది కానీ మహేష్‌తో చేయవద్దని చెప్పాను. తేజ అదేంటి అని ఆశ్యర్యపోయాడు. మీరు చెప్పిన కథ మహేష్‌కి 'ఒక్కడు'కి ముందు వచ్చి ఉంటే సూపర్‌హిట్ అయ్యేది. కానీ 'ఒక్కడు'తో మహేష్ ఇమేజ్ అమాంతం పెరిగిపోతుందని కాబట్టి మహేష్‌తో తీయవద్దని చెప్పాను.
కానీ తేజ 'నిజం'ని మహేష్‌తోనే తీశాడు. నేను చెప్పినట్లుగానే ఈ చిత్రం సరిగా ఆడలేదు. మరో ఉదాహరణ తీసుకుంటే 'పాతాళభైరవి' ముందు 'మల్లీశ్వరి' వచ్చి ఉంటే పెద్ద హిట్ అయి ఉండేది. అలాగే విజయశాంతి నటించిన 'కర్తవ్యం' కంటే ముందే 'ఆశయం' చిత్రం వచ్చి ఉంటే బాగుండేది అని చెప్పుకొచ్చాడు. అందుకే పెద్దల మాట చద్దిమూట అన్నారు మరి. ఈ విషయంలో పరుచూరి విశ్లేషణలో ఎంతో 'నిజం' ఉందని చెప్పాలి..!