తెలుగు సినీ చరిత్రలో ఇప్పటి వరకు అపజయం ఎరుగని దర్శకునిగా రాజమౌళికి పేరుంది. ఆయన ప్రతి చిత్రాన్ని అద్బుతంగా చెక్కుతాడని ఆయనను జక్కన్న అనే ముద్దు పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు. ఇక జబర్ధస్త్ షో ద్వారా అందరికి తెలిసిన వారిలో అదిరే అభి ఒకరు. ఆయన తనకు మొదటి నుంచి దర్శకత్వ శాఖలో ఆసక్తి ఉండటంతో 'బాహుబలి-ది కన్‌క్లూజన్'టీం అనుమతితో ఆ చిత్రం షూటింగ్‌ను దగ్గర నుంచి చూశాడు.
తాజాగా ఆ విశేషాలను ఆయన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ, సెట్లో ప్రతి విషయం పట్ల రాజమౌళి ఎంతో శ్రద్దచూపుతూ ఉంటారు. అన్ని విషయాలను ఆయనే దగ్గరుండి చూసుకుంటూ ఉంటారు. ఆయన సెట్ అసిస్టెంట్ నుంచి కాస్ట్యూమ్ అసిస్టెంట్ వరకు ప్రతి ఒక్కరి పేరు జ్ఞాపకం పెట్టుకుంటారు. అంత మందిలో ప్రతి ఒక్కరిని పేరు పెట్టి మరీ ఆయన పిలుస్తూ ఉంటారు. ప్రొడక్షన్‌లో టీ సప్లై చేసేవాడి పేరు కూడా ఆయనకు గుర్తే.
ఆయనకు ఏది కావాలో దానిని ప్రత్యక్షంగా చూసుకుంటారే గానీ ఆ పనిని వేరే వారికి అప్పగించడం వంటివి చేయరు. ఆయనకు గుర్తు చేయాలనుకోవడం ఎంత మూర్ఖత్వం అవుతుందో నేను ప్రత్యక్షంగా చూశాను అని చెప్పుకొచ్చాడు.