సినీపరిశ్రమలో నేరచరిత్ర కలిగిన వారికి అవినాభావ సంబంధాలు ఎప్పటినుంచో ఉన్నాయి. బాలీవుడ్‌లో మాఫియా ఆధిపత్యం ఎప్పటి నుంచో సాగుతోంది. ఇక మాఫియా వారైన అబూసలేం, దావూద్ ఇబ్రహీం వంటి వారిని కొందరు బాలీవుడ్ నటీమణులు వివాహం కూడా చేసుకున్నారు. బాలీవుడ్‌లో ఓ చిత్రంలో ఎవరెవ్వరు నటించాలి? సాంకేతిక నిపుణులుగా ఎవరిని పెట్టుకోవాలి? ఎవరి వద్ద ఫైనాన్స్ తీసుకోవాలి? దర్శకుడు, హీరో, హీరోయిన్లను కూడా మాఫియానే శాసిస్తుంది. ఇక కోలీవుడ్‌లో కూడా నాడు ఎమ్జీఆర్‌ని పబ్లిగ్గా తుపాకితో కాల్చిన నటుడు, నటి రాధిక తండ్రి రాధారవి గురించి తెలిసిందే. ఇక ఇటీవల కొందరు ఫైనాన్షియర్ల వేధింపుల వల్ల ఓ నిర్మాత ఆత్మహత్య కూడా చేసుకున్నాడు. దీనిపై విశాల్ గట్టిగా స్పందించాడు.
ఇక టాలీవుడ్‌కి వస్తే మొద్దుశ్రీను, భాను వంటి వారికి కూడా మనలోని కొందరు నిర్మాతలతో మంచి పరిచయాలు, బెదిరింపులు ఉన్నట్లు కొంతకాలం కిందట పోలీసులు తేల్చారు. మలయాళంలో ఇటీవల స్టార్ దిలీప్ మలయాళ నటి భావనను కిడ్నాప్, రేప్ ప్రయత్నంలో రౌడీ షీటర్ అయిన పల్సర్ సున్నీకి సంబంధం ఉందని కోర్టు నిర్ధారించింది. ఇక తాజాగా ఇది శాండల్‌వుడ్‌గా పిలవబడే కన్నడ పరిశ్రమకు కూడా పాకిన సంగతి ఈ తాజా ఉదాహరణను బట్టి చూస్తే అర్ధమవుతుంది.
కన్నడలో స్టార్ హీరోగా ఎదుగుతున్న వారిలో యశ్‌ని ప్రముఖంగా చెప్పుకోవాలి. కాగా ఈయనను హత్య చేసేందుకు ఓ ముఠా ప్లాన్ చేసినట్లు తాజాగా కర్ణాటక పోలీసుల దృష్టికి వచ్చింది. 'సైకిల్' రవిని ఏదో కేసులో అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులకు ఆయన నుంచి సంచలన నిజాలు బయటపడ్డాయి. యశ్‌ని చంపడానికి తాము ప్లాన్ చేసినట్లు సైకిల్ రవి చెప్పడంతో అందరు విస్తుపోయారు. ఈవిషయమై ఇటీవల తన స్నేహితులతో బెంగుళూరులో జరిగిన మందు పార్టీ సందర్భంగా ప్లాన్ చేశామని పోలీసుల ఎదుట సైకిల్ రవి ఒప్పుకున్నాడు.
ప్లాన్ వేశామే గానీ కార్యాచరణ మొదలుపెట్టలేదని ఆయన చెప్పుకొచ్చాడు. సినీ నిర్మాత జగ్గణ్ణ ఓ వివాదం నేపధ్యంలో యశ్‌పై సైకిల్ రవి కక్ష్య పెంచుకున్నాడు. అయితే దీనిని కర్ణాటక పోలీసులు లైట్‌గా తీసుకుంటున్నారు. ఏదో తాగిన మత్తులో ఆయన అలా మాట్లాడాడని, ఇది చాలా చిన్న విషయమని, ఈ వాగుడును పట్టించుకోవాల్సిన అవసరం లేదని పోలీసులు అంటుంటే... కన్నడ సినీ ప్రముఖులు మాత్రం చిన్న పామునైనా మొదట్లోనే పెద్ద కర్రతో కొట్టాలని కోరుతున్నారు.