ఈమధ్య ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి ఏ చిత్రం కలిసి రావడం లేదు. ఏవో కలెక్షన్లు రాబట్టినా కూడా ఆయన నటించిన 'కొచ్చాడయాన్'( తెలుగులో విక్రమసింహ) 'లింగ, కబాలి, కాలా' వంటి చిత్రాలు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరుస్తూ వస్తున్నాయి. ఇక తాజాగా రజనీకాంత్ శంకర్ దర్శకత్వంలో 'రోబో' తర్వాత '2.0' చిత్రం చేస్తున్నాడు. ఒకవైపు రజనీ ఫామ్‌లో లేకపోవడం, మరోవైపు సాంకేతిక పరిజ్ఞానం, గ్రాఫిక్స్, వీఎఫ్‌ఎక్స్ పనులంటూ '2.0' చిత్రం ఎప్పుడు రిలీజ్ కానుందో కూడా తెలియని నేపధ్యంలో ఈ చిత్రం కోసం 'రోబో'ని దృష్టిలో పెట్టుకుని కోట్ల రూపాయలను లైకా ప్రొడక్షన్స్‌ని, శంకర్‌ని నమ్మి అడ్వాన్స్ ఇచ్చిన బయ్యర్లలందరు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు వారు కట్టిన అడ్వాన్స్‌లకు వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఎన్నోసార్లు వాయిదా పడిన '2.0'ని ఇక వద్దని భావించిన బయ్యర్లు తమ అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని లైకా ప్రొడక్షన్స్‌ని, శంకర్‌ని అడుగుతూ ఒత్తిడి తెస్తున్నారు. ఈ చిత్రం బడ్జెట్, అమ్మిన రేట్లు చూస్తే ఇది 'బాహుబలి' కంటే పెద్ద హిట్ అయితే గానీ పెట్టిన అసలు కూడా రాదని బయ్యర్ల ఆందోళన. దాంతో పరిస్థితి చేజారిపోతోందని గమనించిన శంకర్ '2.0'ను నవంబర్ 29న విడుదల చేస్తామని ప్రకటించాడు. అయినా బయ్యర్లలో ఆందోళన తగ్గకపోవడంతో వారు శంకర్‌ని, నిర్మాతలను కలిసి తమ అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్న నేపధ్యంలో సాధారణంగా తన చిత్రాలను ఎవ్వరికీ ముందుగా ప్రదర్శించే అలవాటు లేని శంకర్ కూడా ఓ మెట్టుకిందకి దిగాడట.
ఈ చిత్రానికి సంబంధించిన సాంకేతిక పనులన్నీ పూర్తి చేసుకున్న 15 నిమిషాల నిడివి కలిగిన ఫుటేజ్‌ని ఆయన బయ్యర్లకు చూపించారని, దీంతో ఈ 15 నిమిషాల ఫుటేజ్‌ని చూసి బయ్యర్లు ఓ హాలీవుడ్ చిత్రం కంటే అద్భుతంగా ఉందని అబ్బురపోయి సినిమా మీద నమ్మకంతో అడ్వాన్స్‌లు తిరిగి ఇవ్వాలని పట్టుబట్టకుండా వెనుదిరిగి వెళ్లారని సమాచారం. మరి ఈసారైనా శంకర్ తాను ఇచ్చిన డేట్‌కి '2.0' ని విడుదల చేస్తాడో లేదో వేచిచూడాల్సివుంది...!