తాజాగా కత్తి మహేష్ రామాయణం, శ్రీరాముడు, సాధ్వి సీతల గురించి నానా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. కొందరు ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడవచ్చని అంటుంటే...మరికొందరు మాత్రం కేవలం హిందువులనే టార్గెట్ చేస్తున్నారు. ఇదే విధంగా ముస్లింల ఖురాన్, క్రైస్తవుల బైబిల్ గురించి వ్యాఖ్యలు చేయగలరా? అని ఆగ్రహం వెలిబుచ్చుతున్నారు.
ఇక తాజాగా దీనిపై తెలుగు సినీ ప్రముఖుడు, సీనియర్ అయిన తమ్మారెడ్డి భరద్వాజ స్పందించాడు. అమెరికాలో ఎవరు పుట్టినా అమెరికన్ అయినట్లు, ఇండియాలో ఎవరు పుట్టినా వారు హిందువులవుతారు. ఇది ఒక మతం పేరు కాదు.. మన జాతీయత భావం. కాబట్టి హిందువులను ఇతరులు, ఇతరులు వారిని తిట్డడం, విమర్శించుకోవడం మానుకోవాలి. భారతదేశంలో పుట్టిన వారందరు హిందువులే. అంతే గానీ నాన్ హిందు అంటూ ఎవ్వరూ ఉండరు.
కానీ మహా కావ్యాలైన రామాయణం, భాగవతం, భారతం వంటి వాటిని మనం ఏ దృష్టితో చదువుతామో మనకు అలానే అనిపిస్తుంది. కొందరు ఇది నిజంగా జరిగింది అంటారు. కొందరు అబద్దమంటారు. మరికొందరు ఇది కల్పితంగా భావిస్తారు. ఎవరు ఎలా చూస్తే వారికి అవి అలా వారి మనసుకు, ఆలోచనకు తగ్గట్లుగా కనిపిస్తాయి. మంచిని తీసుకుని, చెడును వదిలేయాల్సి వుంటుంది. అంతేగానీ మనం పేరుతో, హిందు, నాన్ హిందు పేరుతో ఇలా ప్రవర్తించడం మాత్రం బాధాకరమని ఆయన తెలిపారు.