తెలుగులో తమిళ మూవీ 'బాయ్స్' ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన నటి జెనిలియా డిసౌజా. ఈమె ఆ తర్వాత 'బొమ్మరిల్లు, రెడీ' చిత్రాలతో పాటు ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి స్టార్ హీరోల సరసన కూడా నటించింది. ముఖ్యంగా బొమ్మరిల్లు చిత్రంలో 'హా.. హా.. హాసిని' అని ఆమె చేసిన అల్లరికి తెలుగు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఇక ఈమె 'ఆరెంజ్' చిత్రం తర్వాత సినిమాల వేగం తగ్గించింది. ఇదే క్రమంలో ఈమె బాలీవుడ్‌లో కూడా నటిస్తూ, తన లాంగ్‌టైమ్ బోయ్‌ఫ్రెండ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, దివంగత విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ కుమారుడు రితేష్ దేశ్‌ముఖ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరూ కలిసి కొన్ని చిత్రాలలో కూడా నటించారు. ఆ సమయంలో వారి స్నేహం పెళ్లికి దారి తీసింది.
ఇక రితేష్‌దేశ్‌ముఖ్ బాలీవుడ్‌లో హీరోగా, కమెడియన్‌గా, నెగటివ్ పాత్రలను కూడా చేశాడు. అయినా ఆయనకు అనుకున్న స్థాయిలో స్టార్‌డమ్ రాలేదు. ఇక ఈయన బాలీవుడ్‌తో పాటు మరాఠీ చిత్రాలలో కూడా నటించాడు. ప్రస్తుతం ఆయన అక్షయ్‌కుమార్ హీరోగా నటిస్తున్న 'హౌస్‌ఫుల్4' చిత్రంలో నటిస్తున్నాడు. సినిమాలలో పెద్దగా చాన్స్‌లు కూడా లేని క్రమంలో ఆయన తాజాగా రాజకీయాలపై తన దృష్టిని మళ్లించాడు.
ఈయన మహారాష్ట్రలోని లాతూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సిద్దమవుతున్నాడు. ఆయనకు పార్టీ టిక్కెట్ ఇవ్వడానికి కాంగ్రెస్ అధిష్టానం కూడా దాదాపు ఓ స్ధిరమైన నిర్ణయానికి వచ్చేసింది. అంటే 2019 ఎన్నికల్లో ఆయన ఎంపీ సీటుకి నిలబడటం ఖాయం. అంతలోపు తాను చేస్తున్న చిత్రాలను పూర్తి చేసి ఆయన తన నియోజకవర్గం మీదనే దృష్టి సారించనున్నాడు. విలాస్‌రావుకి ఉన్న ప్రజల ఆదరణ, సింపతీ ఓట్లు పడితే రితేష్ గెలుపు సాధ్యపడుతుంది. అంటే రాబోయే కాలంలో జెనిలియా రాజకీయ నాయకుని భార్యగా అవతరించబోతోందన్న మాట...!