బిగ్‌బాస్ సీజన్1ని కేవలం సెలబ్రిటీలకే పరిమితం చేశారు. కానీ నాని హోస్ట్ చేస్తోన్న 'బిగ్‌బాస్ సీజన్2'లో కామన్‌మెన్‌కి కూడా ప్రవేశం కల్పించారు. అయితే ఈ కామన్‌మెన్‌ల ఎంపిక ఎలా జరిగింది? అనేది అందరిలో పలు అనుమానాలకు కారణం అవుతోంది. దీనికి కారణం బిగ్‌బాస్‌లో పాల్గొంటే ఆటోమేటిగ్గా సెలబ్రిటీ హోదా వచ్చి సినిమా చాన్స్‌లు కూడా అందుకుంటున్నారు. గత సీజన్‌లో కత్తి మహేష్ ఈ తరహా వ్యక్తే. ఇక బిగ్‌బాస్2లో కామన్‌మెన్‌గా ఎంట్రీ ఇచ్చి ఎలిమినేట్ అయిన నూతన్‌నాయుడుపై ఇప్పుడు సోషల్‌మీడియాలో పలు వార్తలు గుప్పుమంటున్నాయి.
తనకి ప్రత్యేక గుర్తింపు రావడం కోసం బాగా ధనవంతుడైన నూతన్‌నాయుడు బిగ్‌బాస్ నిర్వాహకులకు 4కోట్ల రూపాయలు ఇచ్చి బిగ్‌బాస్ పార్టిసిపెంట్‌గా ఎంపికయ్యాడనేది ఆ వార్తల సారాంశం. తాజాగా ఈ విషయంపై నూతన్‌నాయుడు స్పందించాడు. సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదు. నేనొక్క పైసా కూడా వారికి ఇవ్వలేదు. నేను డబ్బులిచ్చి షోకి వెళ్లానని నన్ను గతంలో కూడా పలువురు పలు ఇంటర్వ్యూలలో అడిగారు. బిగ్‌బాస్‌ని నిర్వహిస్తున్న సంస్థకు నాలుగుకోట్లు అంటే చాలా చిన్నమొత్తం.
సంస్థ ప్రతినిధులు మా ఇంటికి వచ్చినప్పుడు బోకే ఇచ్చి ఆహ్వానించాను. కానీ వారు అవి తీసుకునేందుకు కూడా నిరాకరించారు. వారికి నిజంగా హ్యాట్సాఫ్ అని చెప్పుకొచ్చాడు. అయినా నూతన్‌నాయుడు నాలుగు కోట్ల వ్యవహారంపై మాత్రం వార్తలు ఆగడం లేదు. లంచం ఇచ్చిన వ్యక్తి, తీసుకున్న వ్యక్తులు తాము నిజంగా ఇచ్చి, తీసుకున్నా వాటిని బహిరంగంగా ఒప్పుకోరు కదా..! అని కొందరు సెటైర్లు వేస్తున్నారు.