పాతకాలంలో ఎన్టీఆర్, ఏయన్నార్, ఎస్వీఆర్, సావిత్రి వంటి మహామహులు కూడా తమకు ఎంత అనుభవం ఉన్నా కూడా ఒకసారి దర్శకుడు ఓకే చేసిన తర్వాత ఆయన చెప్పినట్లే నటించేవారు. కానీ నేడు మాత్రం పెద్దగా అనుభవంలేని, అప్పుడప్పుడే ఇండస్ట్రీకి వచ్చి గుర్తింపు తెచ్చుకుంటున్న వారు కూడా దర్శకులు, నిర్మాతలు, తోటి నటీనటులపై తమ పైత్యం చూపిస్తూ ఉంటారు. నటుడనే వాడు తనకి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, బాగా నటించి తన పాత్రకి న్యాయం చేయాలే గానీ నిర్మాతలు, దర్శకుల విషయంలో వేలు పెడుతుండటం బాధాకరం.
ఇక విషయానికి వస్తే ఆమద్య పవన్‌కళ్యాణ్ నటించిన ఓ చిత్రం షూటింగ్ సందర్భంగా పవన్‌కళ్యాణ్ కమెడియన్ షకలకశంకర్‌ని బాగా మందలించాడని, కొట్టబోయాడని కూడా వార్తలు వచ్చాయి. తాజాగా దీనిపై షకలక శంకర్ స్పందించాడు. నేను పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమానిని. ఆయనంటే నాకు ప్రాణం. ఆ సినిమాలో నేను చేయడానికి ఒప్పుకున్నదే పవన్‌ని దగ్గరగా చూసేందుకు. ఆ చిత్రం షూటింగ్ సమయంలో పవన్‌ని అలా చూస్తూ ఉండిపోయే వాడిని. ఆ చిత్రంలో ఏ సీన్స్‌లో నటించాలి? నా పాత్ర ఏమిటి? అనేవి కూడా నేను పట్టించుకోకపోవడానికి పవన్‌కళ్యాణ్‌తో నటించాలనే కోరిక మీదనే.
కాగా ఆ చిత్రం షూటింగ్‌లో దర్శకులు తీసిన సీన్స్‌నే మరలా మరలా తీస్తున్నారు. దాని వల్ల నిర్మాతగా కూడా ఉన్న పవన్‌కి డబ్బు వృధా అవుతోందని భావించాను. అదే కోపంతో కోడైరెక్టర్‌ని పిలిచి అరిచాను. ఆ విషయం తెలిసిన తర్వాత పవన్ నన్ను పిలిపించాడు. 'ఏరా.. అప్పుడే డైరెక్టర్లను, కోడైరెక్టర్లను అనేంత రేంజ్‌కి వచ్చేశావురా నువ్వు? వాళ్లు ఎన్నిసార్లు తీస్తే నీకెందుకు? నీకు అవసరమా? నీ హద్దులో నువ్వు ఉండు. పని చేసుకునిపో.. అంతేగానీ ఇతర విషయాలలో వేలుపెట్టవద్దు. వెళ్లిపో' అని అరిచారు... ఈ రోజు జరిగింది అదే అని షకలకశంకర్ చెప్పుకొచ్చాడు.