రాక్షస బల్లులైన డైనోసార్లపై స్టీవెన్ స్పీల్ బర్గ్ తీసిన మొదటి చిత్రం 'జురాసిక్ పార్క్' ప్రపంచ సినీ చరిత్రలోనే సరికొత్త రికార్డులను సృష్టించింది. ఆ తర్వాత దానికి కొనసాగింపుగా 2015లో వచ్చిన 'జురాసిక్ వరల్డ్' కూడా హాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. దీనికి మరో కొనసాగింపుగా తాజాగా 'జురాసిక్ వరల్డ్.. ది ఫాలెన్ కింగ్‌డమ్' చిత్రం ఇటీవల జూన్8వ తేదీన విడుదలై మరో సంచలనానికి నాంది పలుకుతూ భారీ కలెక్షన్లు కొల్లగొడుతోంది.
ఈ చిత్రం ఇప్పటికే బిలియన్ డాలర్ల క్లబ్‌లో స్థానం సాధించింది. బిలియన్ అంటే దాదాపు రూ.6,800కోట్లను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. ఈ మైలురాయిని అందుకున్న 35వ చిత్రంగా 'జురాసిక్ వరల్డ్..దిఫాలెన్ కింగ్‌డమ్' రికార్డులను సృష్టించింది. 1000కోట్లకు పైగా బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందింది. యునైటెడ్ స్టేట్స్‌లో 304.8మిలియన్ డాలర్లు, ప్రపంచ వ్యాప్తంగా 700.7 మిలియన్ డాలర్లను వసూలు చేయడం విశేషం. డైనోసార్లు జీవిస్తున్నఓ దీవిలో అగ్నిపర్వతం బద్దలు అవుతుందని తెలిసి, వాటిని కాపాడేందుకు ఓ బృందం ప్రయత్నిస్తుంది.
ఈ నేపధ్యంలో వారికి ఎదురైన అనుభవాలను ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రంలో చూపించారు. క్రిస్‌పాట్, బ్రిన్‌డల్లాస్ హోవార్డ్‌లు ఈ చిత్రంలో ప్రధాన పాత్రలను పోషించారు. ఏజే బయోనా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని స్టీవెన్ స్పీల్‌బర్గ్ నిర్మాణ బాధ్యతలను చూసుకోవడం విశేషం. మొత్తానికి మరోసారి స్టీవెన్ స్పీల్‌బర్గ్ తానంటే ఏమిటో ప్రపంచ సినీ ప్రియులకు మరోమారు నిరూపించుకున్నారనే చెప్పాలి.