నేటితరంలో హీరోయిన్లకు పెళ్లి విషయంలో వచ్చే తలనొప్పి ఏమిటంటే.. పెళ్లి చేసుకుంటే ఇక సినిమా చాన్స్‌లు రావని, ప్రేక్షకులు కూడా పాతమాదిరిగా ఆదరించరని వారి అపోహ. దీనిని నాడు సావిత్రి, అంజలిదేవి, కన్నాంబ నుంచి నేటి సమంత వరకు ఎందరో తప్పు అని నిరూపించారు. ఇక బాలీవుడ్, హాలీవుడ్‌లలో అయితే పెళ్లికాని వారికంటే పెళ్లయిన వారికే ఎక్కువ క్రేజ్ ఉంటుంది. కానీ దక్షిణాదిలో ఆ పరిస్థితి ఇంకా పూర్తిగా మారలేదు. ఇప్పుడిప్పుడు అమలాపాల్, సమంత వంటి వారు ఈ విషయంలో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఇక కోలీవుడ్ లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార తన కెరీర్‌లో ఇప్పటికే శింబు, ప్రభుదేవా వంటి వారితో ఎఫైర్లు నడిపింది. అయినా ఆమెకి ఉన్న క్రేజ్ ఏమీ తగ్గలేదు. అయినా ఎందుకైనా మంచిదని చెప్పి, దర్శకుడు విఘ్నేశ్ శివన్‌తో ఆమె తన ఎఫైర్ గురించి మౌనంగా ఉంటోంది. కోలీవుడ్ మీడియా ప్రకారం నయనతార, విఘ్నేష్‌లు ఆల్‌రెడీ వివాహం చేసుకుని ఒకే అపార్ట్‌మెంట్‌లో కాపురం కూడా ఉంటున్నారని తెలుస్తోంది.
ఇక ఇటీవల ఓ అవార్డుల వేడుకలో కూడా నయన 'నాకు కాబోయే భర్తకి ధన్యవాదాలు' అని చెప్పింది. ఇక ప్రస్తుతం నయనతార తమిళంలో 'కొలమావు కోకిల' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం ఈనెలలోనే విడుదలకు సిద్దమవుతోంది. ఇక ఈ చిత్రానికి నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వం వహిస్తుండగా, యోగిబాబు ప్రధానపాత్రను పోషిస్తున్నాడు. అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలోని పాటలకు విఘ్నేశ్ స్వయంగా మొదటి సారి సాహిత్యాన్ని అందిస్తుండటం విశేషం. ఈ సందర్భంగా ఆయన నయనతారకి చెందిన ఈ చిత్రంలోని స్టిల్‌తో పాటు తాను కూడా కలిసి ఆమెతో తీయించుకున్న సెల్ఫీని సోషల్‌మీడియాలో పోస్ట్ చేసి ఆమెపై ప్రశంసల వర్షం కురిపించాడు.
నయన.. 'నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. కొత్త కథలు, దర్శకుల మీద నీకున్న నమ్మకం, నీవు తీసుకునే నిర్ణయాలు, తెరపై నీ ప్రదర్శనలు ఎంతో స్ఫూర్తిదాయకం. నీ ఎక్స్‌ప్రెషన్స్‌కి సాహిత్యం రాయడం ఎంతో గర్వంగా ఉంది. ఎమోషనల్ స్టోరీని తయారు చేసి నెల్సన్ దిలీప్‌కుమార్‌కి, అద్భుతమైన సంగీతం అందించిన అనిరుధ్‌లతో కలిసి పనిచేయడం మర్చిపోలేని అనుభూతి' అని తెలిపాడు. ఇక ఈ 'కొలమావు కోకిల' చిత్రం పాపులర్ అమెరికన్ షో బ్రేకింగ్ బ్యాడ్ ఆధారంగా రూపొందుతోందని సమాచారం.