యధారాజా..తధా ప్రజా అనేది నిజం. పైరసీ అనేది దేశంలోనే కాదు. విదేశాలలోనూ, హాలీవుడ్‌లో కూడా అరికట్టలేని ఓ పెద్ద జాడ్యంగా మారింది. కానీ మన నిర్మాతలు దర్శకులు వీటిపై చేసే పోరాటం మాత్రం వారి సినిమా విడుదలైన ముచ్చటగా మూడురోజల వరకే. ఆ తర్వాత ఆ సంగతే పట్టించుకోరు. ఇక పెరుగుతున్న సినీ వినోదం ఖర్చు దృష్ట్యా మన సినీ ప్రేమికులు కూడా పైరసీకే ఆహ్వానం పలుకుతూ పెద్ద పీట వేస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వాలు, పరిశ్రమ, పోలీసులు, ప్రేక్షకులు అందరు దోషులే. ఇక జర్మనీకి చెందిన టెక్సిపియో సంస్థ పెరుగుతున్న సాంకేతికతో పైరసీ పెరుగుతున్నతీరును ఆరేళ్లుగా స్టడీ చేస్తూ, 2018 ప్రధమార్దంలో విడుదలైన చిత్రాలలో పైరేటెడ్‌కి గురైన టాప్ 10చిత్రాల వివరాలను వెల్లడించింది. దీనిని ఓ దిన పత్రిక ప్రచురించింది.
తెలుగు సినిమాలకి సంబంధించిన పైరసీ షేరింగ్ భారత్‌లోనే కాకుండా యూఎస్, శ్రీలంక, సౌదీఅరేబియా, యూఏఈ, పశ్చిమాసియా దేశాలలో ఎక్కువగా ఉందని తేల్చిచెప్పింది. ఇక భారత్‌లో హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, విశాఖపట్టణం, విజయవాడ, ముంబైలలో కూడా అధికంగా ఉందని తేల్చిచెప్పింది. ఇంతకాలం సినిమా చూసేందుకు స్థోమత లేని పేదలు, నిరక్ష్యరాస్యులు వంటి వారు పైరసీ చూస్తారనే భావన ఎక్కువగా ఉంది. కానీ లక్షలకు లక్షలు సంపాదన ఉండే ఓవర్‌సీస్‌లో, మహానగరరాలలోనే దీని ప్రభావం ఎక్కువగా ఉందని తేలడం గమనార్హం.
ఇక తెలుగులో 'భాగమతి' చిత్రం 19లక్షల డౌన్‌లోడ్లతో ప్రథమస్థానంలో ఉండగా, 'రంగస్థలం' 16లక్షలు, ఆ తర్వాత భరత్ అనే నేను, మహానటి, నా పేరు సూర్య..నా ఇల్లు ఇండియా, తొలిప్రేమ, ఛలో, అజ్ఞాతవాసి, జైసింహా, టచ్ చేసి చూడు..లు ఉన్నాయి.