టాలీవుడ్ పరిశ్రమ.. నవతరం ఆలోచనలు, క్రియేటివిటీ, వైవిధ్యంగా సినిమాలను తీయాలని భావించే దర్శకులతో కళకళలాడుతూ ఉంది. ఇది నిజంగా తెలుగుచలన చిత్ర పరిశ్రమకు గోల్డెన్‌ఏరాగా చెప్పుకోవచ్చు. షార్ట్‌ఫిల్మ్స్ ద్వారా పరిచయమై తమ సత్తా, క్రియేటివిటీ చాటుకుంటున్న దర్శకులు ఏకంగా ఎవరి వద్దా దర్శకత్వ శాఖలో పనిచేయకుండానే మెగా ఫోన్ చేతబట్టి చరిత్రను తిరగరాస్తున్నారు. ఇక నేడు అలాంటి దర్శకుల్లో ఒకరిగా 'పెళ్లిచూపులు' ఫేమ్ తరుణ్‌భాస్కర్‌ని చెప్పవచ్చు. విజయ్‌దేవరకొండ 'అర్జున్‌రెడ్డి' చిత్రంతో స్టార్ అయి సంచలనం సృష్టించి ఉండవచ్చు. కానీ ఈయనకు మొదటి బ్రేక్ లభించిన చిత్రం మాత్రం 'పెళ్లిచూపులు' చిత్రమే. అత్యంత తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం విజయ్‌దేవరకొండతో పాటు ప్రియదర్శి వంటి పలువురు టాలెంట్ కలిగిన నటీనటులను, సాంకేతిక నిపుణులను వెలికితీసింది.
ఇక సామాన్యంగా నేడున్న అగ్రనిర్మాతల్లో సినిమా నిర్మాణం స్పీడుని తగ్గించి ఆచితూచి చిత్రాలు నిర్మిస్తూ, అందునా రిస్క్ ఉండే ప్రాజెక్ట్స్‌ని తెలివిగా భాగస్వామ్యంతో నిర్మిస్తున్న నిర్మాత.. డి.సురేష్‌బాబు. ఈయనను ఓ కథతో మెప్పించాలంటే దేవుడు దిగి వస్తాడని అందరు అనుకునే మాట. అలాంటిది 'పెళ్లిచూపులు' చిత్రం విషయంలో సైలెంట్ పార్ట్‌నర్‌గా వ్యవహరించిన సురేష్ బాబు తరుణ్‌భాస్కర్ చెప్పిన రెండోకథ 'ఈ నగరానికి ఏమైంది' ఒకేసారి విని షూటింగ్‌ని స్టార్ట్ చేయమని చెప్పాడంటే ఆ కథ ఎంతో అనుభవం ఉన్న ఆయన్ను ఎంతలా మెప్పించిందో అర్ధం అవుతుంది. దర్శకుని ప్రతి విషయంలోనూ జోక్యం చేసుకుంటాడన్న అపవాదు ఉన్న సురేష్‌బాబు.. తరుణ్‌భాస్కర్‌పై అంత నమ్మకం ఎందుకు ఉంచాడో ఈ చిత్రం చూసిన వారికి అర్ధమయ్యే ఉంటుంది. అత్యంత లోబడ్జెట్‌తో రూపొందిన ఈచిత్రం అందరినీ కట్టిపడేస్తోంది. ఇక తరుణ్‌భాస్కర్‌కి 'పెళ్లిచూపులు' తర్వాత ఎన్నో చాన్స్‌లు వచ్చినా ఆయన మరో సారి తన కథనే నమ్ముకుని, తనకథకు అద్భుతంగా వెండితెర రూపం కల్పించాడు.
తాజాగా తరుణ్‌భాస్కర్ మాట్లాడుతూ.. 'పెళ్లిచూపులు' ప్రాజెక్ట్ ఓకే అయ్యేనాటికి మా నాన్న మరణించాడు. అమ్మ ఉద్యోగం చేస్తోంది. దాంతో నేను ఆర్దికంగా స్ధిరపడగలనా? లేదా? అని ఎంతో ఆందోళనతో ఉండేవాడిని. అందునా 'పెళ్లిచూపులు' విషయంలో ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే తర్జనభర్జన కూడా మనసును పీడిస్తోండేది. చివరకు ఆ చిత్రం విజయం సాధించడం నాకు ఆత్మస్థైర్యాన్ని, నాపై నాకు నమ్మకాన్ని కల్పించింది అని చెప్పుకొచ్చాడు. తరుణ్‌భాస్కర్ వాళ్ళ అమ్మ 'ఫిదా' చిత్రంలో అత్త పాత్రను పోషించి మెప్పించిన సంగతి తెలిసిందే. మరో విషయం ఏమిటంటే తరుణ్‌భాస్కర్‌తో సురేష్‌బాబు మూడు చిత్రాలు తీయడానికి అగ్రిమెంట్ చేసుకున్నట్లు తెలుస్తోంది.