నేటి రోజుల్లో మీడియా బాగా విస్తరించింది. దాంతో తాము కూడా వార్తల్లో నిలవాలని భావించే వారు దానికోసం పలు మార్గాలను ఎంచుకుంటున్నారు. కొందరైతే ఫలానా నటుడు మా కొడుకు అంటూ ఉంటే.. మరికొందరు ఫలానా నటికి నాకు వివాహం జరిగిందంటున్నారు. ఇక ఇటీవల ప్రియాంకా గాంధీ తన పెళ్లామని ఓ వ్యక్తి వాదించాడు. మరో వృద్ద దంపతులు ధనుష్ మా కొడుకంటే మరో ఇద్దరు విజయ్ మా పిల్లాడంటూ రచ్చచేశారు. ఇక మతిస్థిమితం సరిగా లేని వారి సంగతి సరేసరి. ఈసారి ఈ తలనొప్పి టాలీవుడ్ స్టార్ నాగార్జున మెడకు చుట్టుకుంది.
ఆదిలాబాద్‌కి చెందిన విజయ అనే మహిళ తనకు నాగార్జున 4కోట్లు ఇవ్వాలంటూ ఆయన ఇంటి ముందు హల్‌చల్ చేసి నానా రభస సృష్టించింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వివరాలలోకి వెళ్లితే, నాగార్జున ఉంటున్న రోడ్డు నెంబర్ 51లోని ఆయన నివాసం వద్దకు వెళ్లిన మహిళ తనను నాగార్జున వద్దకు పంపాలని పీఏని అడిగింది. కారణం ఏమిటని ప్రశ్నిస్తే నాగార్జున తనకి 4కోట్లు అప్పుపడ్డాడని గొడవ చేసింది.
దాంతో ఆశ్చర్యపోయిన పీఏ ఆ అర్ధరాత్రి వేళ నాగార్జున ఇంటిలో లేరని చెప్పినా ఆమె వినిపించుకోలేదు. రోడ్డుపై నానా హడావుడి చేసింది. విషయం తెలుసుకున్న పోలీసులు నాగార్జున ఇంటి వద్దకు చేరుకుని ఆమెని అదుపులోకి తీసుకున్నారు. ఆమెకి మతిస్థిమితం సరిగా లేదని తెలుసుకుని బంధుమిత్రులకు సమాచారం అందించడంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కివచ్చింది. తర్వాత ఆమెని వెతుక్కుంటూ వచ్చిన బంధువులకి ఆమెని అప్పగించారు.