జనసేనాధిపతి తెలివితో చేస్తున్నాడో లేక యాదృచ్చికంగా జరుగుతుందో గానీ రాబోయే ఎన్నికల్లో ఆయన తన పాత్ర ఏంటి అనే విషయంపై రాజకీయ విశ్లేషకులను కూడా డైలమాలో పడేస్తున్నాడు. ఆయన పోరాటం టిడిపి మీద తప్పితే రాష్ట్రానికి అన్యాయం చేసిన మోదీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. వాస్తవానికి ఏపీలో అందరు నాయకుల కంటే ముందుగా పాచిపోయిన రెండు లడ్డూలు ఇచ్చారని మోదీని లెఫ్ట్ రైట్ ఆడుకున్నఘనత మాత్రం పవన్‌దే. ఆయనా విషయంలో ఎంతో సాహసోపేతంగా వ్యవహరించాడు. ఎవ్వరికీ భయపడకుండా మోదీని ఉతికి ఆరేశాడు.
కానీ కొంతకాలానికే పవన్ కేంద్రంలోని మోదీని మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. దాంతో కొందరు మరీ ముఖ్యంగా టిడిపి వారు పవన్.. మోదీ చేతిలో కీలుబొమ్మగా మారాడని ఆరోపిస్తున్నారు. మరోవైపు బిజెపి, మోదీ అంటే మండిపడే వామపక్షాలు కూడా వచ్చే ఎన్నికల్లో పవన్‌తోనే నడుస్తాం అంటున్నారు. అలా ఎవ్వరికీ అర్ధం కాని అయోమయస్థితిని పవన్ కల్పిస్తున్నాడు. ఇక తాజాగా ఆయన మాట్లాడుతూ, వైసీపీని గెలిపిస్తే భూములు కభ్జా చేస్తారని గత ఎన్నికల్లో ప్రజలు టిడిపిని గెలిపించారు. కానీ టిడిపి నాయకులు కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నారంటూ మండిపడ్డాడు.
ఇక తాజాగా టిడిపి సర్వేలో మనకి 10శాతం ఓట్లు వస్తాయని తేల్చారు. మొదట్లో మనకి కేవలం 1శాతం ఓట్లే వస్తాయన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. ఫర్వాలేదు. మోదీ, ట్రంప్‌లు కూడా 10శాతం ఓట్లతోనే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఒకరు దేశ ప్రధాని అయితే మరోకరు దేశాద్యక్షుడయ్యారు. మేము కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని కీలక వ్యాఖ్యలు చేశాడు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో టిడిపి, వైసీపీ, జనసేన, బిజెపి, కాంగ్రెస్‌లు పోటీ చేయడం దాదాపు ఖాయమే.
ఇక కాంగ్రెస్ బలపడితే అది వైసీపీకి నష్టం చేకూరుస్తుంది. పోటీ మాత్రం టిడిపి, వైసీపీల మద్యే ఉన్నా జనసేన ఎవరి ఓట్లను చీలుస్తుంది? ఎవరి గెలుపుకు సాయపడుతుంది? అనే విషయంలో భిన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రజారాజ్యం పార్టీ సమయంలో చిరంజీవి.. చంద్రబాబు వ్యతిరేక ఓట్లను చీల్చి పరోక్షంగా కాంగ్రెస్ గెలుపుకు, టిడిపి ఓటమికి కారణమయ్యాడు. మరి వచ్చే ఎన్నికల్లో జనసేనకి పడే ఓట్లు ఎవరివి? అనేది ఆసక్తికరంగా మారింది.