సాంకేతికత పెరిగే కొద్ది దాన్ని దుర్వినియోగం చేసేవారు కూడా పెరుగుతూనే ఉంటారు. శతకోటి మార్గాలకు అనంత కోటి ఉపాయాలు అంటారు. ఇలా సోషల్ మీడియా బాగా వ్యాప్తి చెందిన తర్వాత సైబర్ నేరాల ఉదృతి, వాటి బాధితుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇటీవలే కొందరు శేఖర్‌కమ్ముల పేరు చెప్పి సినిమాలలో చాన్స్‌లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులను కాజేసిన వైనం తెలిసిందే.
ఇక విషయానికి వస్తే అటు కోలీవుడ్‌లో ఇటు టాలీవుడ్‌లో కూడా మంచి పేరున్న కమెడియన్ విద్యుల్లేఖ రామన్. లావుగా, కమెడియన్ పాత్రలు పోషించే ఈమెకి దక్షిణాదిలో మంచి గుర్తింపే ఉంది. ఈమె ప్రముఖ తమిళ సినీ, టివి నటుడు మోహన్‌రామన్ కుమార్తె. ఇక ఈమె కజిన్ గీతాంజలి ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు సెల్వరాఘవన్ భార్య. ఇక విద్యుల్లేఖరామన్ విషయానికి వస్తే ఈమె కోలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో వహించిన 'ఎటో వెళ్లిపోయింది మనసు' చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయింది. ఆ చిత్రంలో ఈమె సమంత స్నేహితురాలి పాత్రను పోషించింది. ఆ తర్వాత తెలుగులో 'రామయ్యా వస్తావయ్యా, రన్‌రాజా రన్, రాజుగారి గది, భలే మంచిరోజు, స్పీడున్నోడు. సరైనోడు, ధృవ, డిజె, ఆనందోబ్రహ్మ, రాజుగారి గది2, రాజా దిగ్రేట్, తొలిప్రేమ, కృష్ణార్జునయుద్దం, ఆచారి అమెరికా యాత్ర' వంటి చిత్రాల ద్వారా టాలీవుడ్‌లో కూడా లేడీ కమెడియన్‌గా రాణిస్తోంది. ఇటీవలే తన లావును కూడా లెక్కచేయకుండా క్లీవేజ్ షో చేసి తన ఆత్మ విశ్వాసం అదేనని చెప్పుకొచ్చింది.
తాజాగా ఆమె ఫేస్‌బుక్ అకౌంట్ హ్యాక్ అయింది. హ్యాక్ చేసిన వారు ఆమెకి సంబంధం లేని నటీనటులు, ఇతర వీడియోలను అందులో పోస్ట్ చేశారు. దీనిపై విద్యుల్లేఖరామన్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఈ విషయాన్ని ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలుపుతూ, నాకో చిత్రమైన, భయంకరమైన అనుభవం ఎదురైంది. నా ఫేస్‌బుక్ ఖాతాను కొందరు హ్యాక్ చేశారు. వారు అందులో వేరే నటి ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేశారు. ఆ పేజీని నేనే నిర్వహించుకుంటూ ఉన్నా ఇది ఎలా జరిగిందో నాకు అర్ధం కావడం లేదు అంటూ తన ఆవేదనను తెలియజేసింది.