మన పూర్వీకులు రాసిన గ్రంధాలు, ఇతిహాసాలు, పురాణాల లోగుట్టు ఎవ్వరికీ ఒక పట్టాన అర్ధం కాదు. ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి అదే దృష్టితో అవి కనిపిస్తాయి. వాటి నిగూఢ రహస్యాలు తమకి తెలుసని, వాటిని తాము ఎంతో అధ్యయనం చేశామని చెప్పుకునే వారిని మూర్ఖులుగా చెప్పాలి. ఎందుకంటే వాటి లోతును, అందులోని అర్ధాలను తెలుసుకోవడం సామాన్యుల వల్ల కాని పని. ఇక మహాభారతం, రామాయణం వంటివి ఎన్నిసార్లు చూసినా, చదివినా వాటిలో ప్రతి సారి ఎన్నో సరికొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి. మన పూర్వీకులు చెప్పినవన్నీ నిజానికి మనశ్శాంతి, దేవునిపై నమ్మకం, చావు పుట్టుకల గురించిన ఆలోచన లేకుండా చేయడం, సైన్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ వంటివన్నీ అందులో ఉంటాయి. మన 'భగవద్గీత'ను పాశ్చాత్యదేశాలు మనో వికాస గ్రంథాలుగా గుర్తిస్తున్నారు. ఇక రామాయణం, మహాభారతం వంటి వాటిని పలువురు పలు కోణాలలో విశ్లేషిస్తూ వాటికి కొత్త భాష్యం చెబుతూ గ్రంథాలు రాశారు. వాటిల్లో ఒకదానికి మరో దానికి పొంతన ఉండకపోవడం సహజమే. మహామహా మేధావుల నుంచి రాజమౌళి వరకు 'మహాభారతం' విషయంలో ఓకే మాట చెబుతుంటారు. ఇతరులు వాటిని సినిమాలుగా తీయాలని భావిస్తుంటే, మరి మీరు కూడా దానినే సినిమాగా తీయాలనుకుంటున్నారు కదా..! అంటే మహాభారతం వంటివి మహాసముద్రాల వంటివి. ఎవరికి వారు చెంబుడు నీరు తీసుకున్నా ఇంకా అందులో చెప్పాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి అని చెబుతారు.
ఇక దైత్వం, అద్వైతం, త్రైత వంటివి వచ్చినట్టుగా ఈ పురాణ గాధలపై లెక్కలు మించిన పుట్టగొడుగుల్లా పుస్తకాలు రచించిన వారు ఎందరో ఉన్నారు. ఇది కేవలం హిందువులు కొలిచే గ్రంధాలకే కాదు.. బైబిల్, ఖురాన్‌లకు కూడా వేర్వేరు భాష్యాలు చెప్పేవారు ఎందరో ఉన్నారు. వాటిని తప్పుపట్టి వాటిల్లోని లొసుగులను చూపించే కుహనా మేధావులకు కూడా కొదువ లేదు. ఇక విషయానికి వస్తే తాజాగా కత్తి మహేష్ శ్రీరాముడిని దూషిస్తూ నానా వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక పోలీసుల విచారణ అనంతరం ఆయన విచారణ నిమిత్తం ఎప్పుడు పిలిచినా మరలా రావాల్సిఉంటుందని పోలీసులు ఆయన్ను విడిచిపెట్టారు. బయటికి వచ్చిన కత్తిమహేష్ రామాయణం యుద్దకాండలో శ్రీరాముడు సీతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగా శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి చేసిన అనువాదంలోని కొన్ని వ్యాఖ్యలను ఆయన మరోసారి ప్రస్తావించి కొత్త రగడకు తెరలేపాడు.
శ్రీరాముడే సీతను నువ్వు రావణుడి నుంచి తిరిగి వచ్చావు. నా ప్రతిష్ట కోసమే నిన్ను విడిపించాను గానీ నిన్ను భార్యగా స్వీకరించడానికి నేను ఆ పని చేయలేదు. నీకు ఇష్టమొచ్చిన వారి దగ్గరికి వెళ్లు. లక్ష్మణుడు, భరతుడు, విభీషణుడు, సుగ్రీవుడు వంటి ఎవరి దగ్గరకైనా వెళ్లి ఉండు. దుర్భుద్ది కలిగిన రావణుడు నిన్ను ఊరికే వదిలిపెట్టి ఉండడు అంటూ ఆయన రాసిన ఏవేవో వ్యాఖ్యలను చేసి కత్తిమహేష్ మరలా తన వాదనను వినిపించడం పట్ల హిందువులు మండిపడుతున్నారు. ఇలాగైతే బైబిల్‌ని, ఖురాన్‌కి కూడా ఎన్నో వక్రభాష్యాలు చెప్పవచ్చు. మరి అన్నిమతాలలోకి అన్ని బాగున్న గ్రంధం ఏమిటో కత్తి మహేష్ వెళ్లడిస్తే ఆయన వాదన తప్పు అని నిరూపించడానికి కొందరు హిందు మేధావులు సిద్దంగా ఉన్నామని కత్తికి బహిరంగ సవాల్ విసురుతున్నారు. మరి కత్తి అందుకు సిద్దమేనా?