చిరంజీవి ఒక్కో మెట్టు ఎదుగుతూ, చిన్న చిన్న పాత్రలు, విలన్ పాత్రల నుంచి సుప్రీంహీరోగా, అక్కడి నుంచి మెగాస్టార్‌గా ఎదిగిన తీరు అందరికీ ఆదర్శం. ఎలాంటి గాడ్‌ఫాదర్ లేకుండానే ఆయన ఈ స్థాయికి ఎదిగారు. ఇక ఈయన పేరును స్టార్ హీరోగా డ్యాన్స్‌లు, ఫైట్స్, మాస్ ఇమేజ్ వంటి ద్వారా రామ్‌చరణ్ నిలబెడుతూ తండ్రికి తగ్గ వారసునిగా ఎదుగుతున్నాడు. ఇక నటనాపరంగా కూడా తనలోని సత్తాని ఈయన 'ధృవ' మరీ ముఖ్యంగా 'రంగస్థలం' ద్వారా నిరూపించుకుని తండ్రికి పుత్రోత్సాహం కలిగించాడు. 'రంగస్థలం' రామ్‌చరణ్‌ని నటనా పరంగా ఏకంగా 10మెట్లు పైకి ఎక్కించిందనే చెప్పాలి. నిన్నటివరకు చరణ్ నటనపై వస్తున్న విమర్శలకు, ఆయన చేస్తున్న మూస చిత్రాలపై వస్తున్న సెటైర్లకు ఆయన చెక్‌పెట్టాడు.
మరోవైపు అంజనా ప్రొడక్షన్స్, గీతాఆర్ట్స్ వంటివి ఉన్న కూడా తమ హోం బేనర్‌గా 'కొణిదెల' సంస్థను స్థాపించి, తన తండ్రి దశాబ్దం తర్వాత అందునా తన 150వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'ఖైదీనెంబర్ 150'తో నిర్మాతగా కూడా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు తన తండ్రి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్‌ని తన తండ్రి 151వ చిత్రంగా కనీవినీ ఎరుగని రీతిలో దేశం గర్వపడేలా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో 22 ఎకరాలలో వేసిన సెట్స్‌లో జరుగుతోంది. ఇక చిరంజీవి అన్ని సాధించినా కూడా ఆయన స్టూడియో నిర్మాణం మాత్రం ఇప్పటివరకు నెరవేరలేదు. ఆయన ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో కలిసి వైజాగ్, భీమిలీ వంటి ప్రాంతాలలో స్టూడియో నిర్మించాలని భావిస్తున్నట్లు ఎప్పటి నుంచో వార్తలు వస్తున్నాయి.
మరి ఇప్పటికీ ఇబ్బందుల్లో ఉన్న ఏపీ కంటే హైదరాబాద్‌లోనే స్టూడియో నిర్మాణం ఆర్దికంగా కూడా లాభదాయకమని, అందునా ఎంతనుకున్నా చిరంజీవికి.. కేసీఆర్, కేటీఆర్‌లు మంచి సన్నిహితులే కాబట్టి ప్రస్తుతం 'సై..రా..' షూటింగ్ జరుగుతున్న 22 ఎకరాలలోనే స్టూడియోను కూడా నిర్మించాలని చరణ్ ఓ నిర్ణయానికి వచ్చాడట. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులకు హైదరాబాద్‌లో స్టూడియోలు ఉండటంతో తమ స్టూడియోను కూడా హైదరాబాద్ శివార్లలోనే నిర్మించాలని మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్ ఓ నిర్ణయానికి వచ్చారట. మరి ఈ స్థలం ఎవరిది? ప్రభుత్వం వీరికి స్టూడియో నిర్మాణానికి తక్కువ రేటుకు లేదా ఉచితంగా స్థలాన్ని ఇస్తుందా? లేదా? అనేవి వేచి చూడాల్సివుంది...!