సోషల్ మీడియా వల్ల ఎంత ఉపయోగం ఉందో దుర్వినియోగం చేస్తే అంత ప్రమాదం కూడా ఉంది. ఇక దీనిని సరిగ్గా వాడుకుంటూ షార్ట్ ఫిల్మ్స్‌ని తీసి తమ టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంటున్న వారు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా దర్శకులు కావాలని ఆశపడుతున్న ఎందరో ఒకనాడు ఏళ్లకొద్ది ఇతర దర్శకుల వద్ద పనిచేస్తే గానీ సొంతగా దర్శకత్వం వహించేందుకు అవకాశాలు వస్తాయో లేదో తెలియని పరిస్థితి. కానీ విస్తృతమైన సాంకేతిక విప్లవంతో నేటి దర్శకులే కాదు.. అన్ని విభాగాల వారు తమ టాలెంట్‌తో ఏకంగా స్టార్స్‌ని కూడా డైరెక్ట్ చేసే స్థాయికి ఎదుగుతున్నారు.
ఇటీవల పవన్ పాటలను పాడిన పోలెండ్ చిన్నారి, 'ఒరు ఆధార్ లవ్' ప్రియా వారియర్ వంటి వారు కూడా ఇదే కోవలోకి వస్తారు. ఇక తాజాగా కేరళకి చెందిన ఓ వ్యవసాయ కూలీ స్వతహాగా మంచి గాయకుడే అయినా ఆయన ప్రతిభ ఇంతకాలం వెలుగులోకి రాలేదు. ఏదో బాత్రూం సింగర్‌గా మారిపోయిన ఆయన 'విశ్వరూపం' చిత్రంలో శంకర్‌మహదేవన్ పాడిన పాటను అద్భుతంగా పాడాడు. దానిని ఆయన స్నేహితులు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. శంకర్‌మహదేవన్‌ని మరిపించేలా ఉన్న ఆయన వాయిస్ విని నెటిజన్లు ఆయనపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చివరకు ఈ వైరల్ అవుతున్న వీడియో గురించి ఏకంగా శంకర్‌మహదేవన్ వరకు చేరింది.
రాకేష్ అనే ఈ కూలితో కలిసి పనిచేయాలని ఉందని శంకర్ మహదేవన్ తాజాగా ట్వీట్ చేశాడు. ఇతను ఎక్కడ ఉంటాడో అడిగి తెలుసుకుని సోషల్ మీడియా ద్వారా ఈయన ఫోన్ నెంబర్ కనుక్కుని, స్వయంగా ఫోన్ చేసి మరీ అభినందించాడు. తన పాటకు వచ్చిన రెస్పాన్స్‌ని చూసి ఆ రాకేష్ అనే కూలి ఆశ్చర్యపోతూ, శంకర్ మహదేవన్ వంటి వ్యక్తి తనని అభినందించాడని ఆనందంగా చెబుతున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ రాకేష్ అనే వ్యవసాయ కూలీ గాయకునిగా బిజీ అయిపోయినా ఆశ్చర్యం లేదనే చెప్పాలి.