ఏరు దాటాక తెప్ప తగలేయడం అనే సామెతను వినే ఉంటారు. ఇప్పుడు తరుణ్ భాస్కర్ వ్యవహార శైలి అలానే ఉంది. 'పెళ్ళిచూపులు' సమయంలో తన సినిమాను పది రోజుల ముందే మీడియాకి ప్రదర్శించి వాళ్ళ పూర్తి సపోర్ట్ ను అందుకొన్న తరుణ్ భాస్కర్.. అప్పట్లో ఆ మీడియా రివ్యూస్ నే తన సినిమా ప్రమోషన్స్ కోసం వాడుకొన్న విషయాన్ని, వాస్తవాన్ని మర్చిపోయి.. ఇప్పుడు తన తాజా చిత్రం 'ఈ నగరానికి ఏమైంది?' విషయంలో కాస్త తప్పులు చెప్పేసరికి రివ్యూలు, రివ్యూ రైటర్లు మీద మండిపడిపోతున్నాడు. నిజానికి 'ఈ నగరానికి ఏమైంది?' సినిమా బాలేదు, హిట్ అవ్వదు అని ఏ ఒక్క విశ్లేషకుడు పేర్కొనలేదు, అందరూ చెప్పిన మాట ఒక్కటే 'కథ లేదు, సన్నివేశాల అల్లిక విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది' అని మాత్రమే జాగ్రత్త చెబుతూ తరుణ్ భాస్కర్ కి చిన్న మొట్టికాయ వేశారు. నిజానికి ఒక ఫిలిమ్ మేకర్ గా తరుణ్ ఆ మొట్టికాయలను పాఠాలుగా కుదిరితే గుణపాఠాలుగా తీసుకోవాలి. అలాంటిది 'ఈ రివ్యూ రైటర్లను నేను సంతోషపరచలేను' అని కామెంట్ చేయడం ఎంతవరకూ సబబు.
రెండేళ్ల క్రితం పొగిడి, థియేటర్ లో కలిసిన ప్రతి రివ్యూ రైటర్ ను కావలించుకొని మరీ కబుర్లు చెప్పిన తరుణ్ భాస్కర్ ఇలా రెండో చిత్రానికి వారిపై నిప్పులు చెరగడం, పైగా తన ఫిలిమ్ యూనిట్ల దగ్గర 'రివ్యూ రైటర్స్ అందరూ ఫిలిమ్ అప్రిసియేషన్ కోర్స్ చేయాలి' అంటూ కామెంట్స్ చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది. తరుణ్ భాస్కర్ మాత్రమే కాదు చాలా మంది దర్శకనిర్మాతలు, కథానాయకులు కూడా తమ సినిమాలు రివ్యూల కారణంగా హిట్ అయినప్పుడు మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పరు. అదే పొరపాటున తమ సినిమాకి కలెక్షన్స్ తగ్గుతున్నాయి, వాటికి నెగిటివ్ రివ్యూస్ కారణం అనగానే పేట్రేగిపోతారు. సినిమాకి నెగిటివ్ రాసినప్పుడు 'మీరు రివ్యూలు రాయడంలో కోర్స్ చేశారా?' అనే ప్రశ్న పాజిటివ్ రివ్యూలు రాస్తున్నప్పుడు ఎందుకు అడగరు?