వాస్తవానికి డి.రామానాయుడు మరణం తర్వాత సురేష్ ప్రొడక్షన్స్ చిత్రం సినిమా నిర్మాణాలను బాగా తగ్గించింది. ఏదో ఒకటి అరా కోరా చిత్రాలు నిర్మించినా 'గోపాలగోపాల, దృశ్యం, మసాలా, గురు' వంటి చిత్రాలను ఇతరుల భాగస్వామ్యంతో నిర్మించింది. ఇక సురేష్‌బాబు ఇప్పుడు ఎక్కువగా కాన్సెప్ట్ ఓరియంటెడ్ చిత్రాలపై దృష్టి సారించి 'పెళ్లిచూపులు' తర్వాత మరలా తరుణ్‌భాస్కర్ దర్శకత్వంలో అంతా కొత్తవారితో 'ఈ నగరానికి ఏమైంది' అనే చిత్రం తీశాడు. ఇది ఘన విజయం దిశగా సాగుతోంది. ఇక త్వరలో ఆయన ఎ.కె ఎంటర్‌టైన్‌మెంట్స్ భాగస్వామ్యంలో వెంకటేష్‌తో ఓ చిత్రం, ఇక గుణశేఖర్ దర్శకత్వంలో రానా హీరోగా 'హిరణ్యకస్యప' అనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 'నేనే రాజు నేనేమంత్రి' తర్వాత మరోసారి తన తనయుడు రానాకి ఈ చిత్రంతో బ్రేక్ ఇవ్వాలని ఆశిస్తున్నాడు.
తాజాగా సురేష్‌బాబు స్పందిస్తూ, టాలీవుడ్‌ని చులకన చేస్తున్న వారిని నియంత్రించడం అంత సులభం కాదని అన్నారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, ప్రతిభ కలిగిన అందరికీ ఇండస్ట్రీలో అవకాశాలు ఉంటాయి. కాస్టింగ్‌కౌచ్ సమస్యపై ఇప్పటికే కమిటీ వేశాం. ఎక్కడ ఏమి జరిగినా దానికి టాలీవుడ్‌నే బాధ్యురాలిని చేయడం అన్యాయం. ఎక్కడో అమెరికాలో సెక్స్ రాకెట్ బయటపడితే దానికి కూడా టాలీవుడ్‌ని బాధ్యురాలిని చేస్తున్నారు. ఈ పరిణామాలు చాలా బాధాకరం. దీనికి సంబంధించిన వ్యక్తులు ఎవరో కూడా మాకు తెలియదు.
ఇక చిన్న చిత్రాలకు ధియేటర్లు దొరకడం లేదన్నది నిజం కాదు. మంచి సినిమాలకు ఖచ్చితంగా థియేటర్లు దొరుకుతాయి. 50ఏళ్ల సురేష్ ప్రొడక్షన్స్ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మాపై ఉంది. సంస్థ పది కాలాల పాటు పచ్చగా ఉండేలా చూసుకోవాలి.. అంటూ చెప్పుకొచ్చారు. ఇక శ్రీరెడ్డి ఆరోపణల్లో మొదటి పేరు సురేష్‌బాబు చిన్నకుమారుడు అభిరామ్‌ది. ఈ విషయంపై మాత్రం ఆయన తెలివిగా మౌనమే పాటిస్తుండటం గమనార్హం.