ప్రస్తుతం సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ ను సరిగ్గా వినియోగించుకోగలిగితే.. సాధారణ నటుడు కూడా సూపర్ స్టార్ స్థాయి స్టార్ డమ్ ను సంపాదించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ.. క్రేజ్ అలా రాదు. ఈ క్రేజ్ కారణంగా అందలాలెక్కిన నటులు ఉండగా.. అదే క్రేజ్ కారణంగా ఇబ్బందులు పడిన నటులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆ క్రేజ్ కారణంగా ఇబ్బంది పడుతున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. 'పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి' చిత్రాలకు ముందు అయిదు సినిమాల్లో నటించినా రాని పేరు ఆ రెండు సినిమాలతో వచ్చేసింది. ముఖ్యంగా 'అర్జున్ రెడ్డి'తో ప్రేక్షకులకు బాగా చేరువయ్యాడు విజయ్ దేవరకొండ. ఇప్పుడు ఈ క్రేజ్ కారణంగా విజయ్ కి పెద్ద సమస్యే వచ్చి పడింది.
బేసిగ్గా.. ఇండస్ట్రీలో ఒక స్టార్ హీరో సినిమా మొదలవుతుందంటే ఆ సినిమాలో హీరోయిన్ కూడా సదరు స్టార్ హీరోకి సమానమైన రేంజ్ లేదా స్టార్ డమ్ ఉన్న అమ్మాయి అయ్యుండాలి. అయితే.. విజయ్ దేవరకొండ ఓవర్ క్రేజ్ కారణంగా బడా హీరోయిన్లేమో మనోడి సరసన నటించడానికి ఒప్పుకోవడం లేదు, యువ కథానాయికలెవరూ మనోడికి సెట్ అవ్వడం లేదు, పోనీ కొత్తవాళ్లని తీసుకొందామా అంటే సినిమా పబ్లిసిటీ మరియు మార్కెటింగ్ విషయంలో మైనస్ అవుతుందని నిర్మాత భావిస్తున్నాడు. ప్రస్తుతం ఈ కన్ఫ్యూజన్ లో కొట్టుమిట్టాడుతున్న నిర్మాత కె.ఎస్.రామారావు. ఆయన నిర్మాణంలో 'ఓనమాలు' ఫేమ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా నిర్మించడానికి సన్నద్ధమవుతున్నారు. వచ్చే ఏడాది సెట్స్ కు వెళ్లనున్న ఈ సినిమాలో హీరోయిన్ ఇప్పటివరకూ సెట్ అవ్వలేదు. దాంతో ఎవర్ని ఫైనల్ చేయాలో తెలియడం లేదు సీనియర్ ప్రొడ్యూసర్ రామారావుకి.