దక్షిణాదిలో యాక్షన్‌కింగ్‌గా పేరు తెచ్చుకున్న హీరోలలో మొదటి వ్యక్తి అర్జున్. ఆయన తెలుగులో నటించిన 'మాపల్లెలో గోపాలుడు' నుంచి 'జెంటిల్‌మేన్, ఒకే ఒక్కడు, పుట్టింటికిరా చెల్లి, హనుమాన్ జంక్షన్' వంటి ఎన్నో చిత్రాలు సూపర్‌హిట్స్‌గా నిలిచాయి. తమిళం, కన్నడలో కూడా ఈయనకు ఎంతో గుర్తింపు ఉంది. ఇక ఇటీవల అర్జున్ తెలుగులో నితిన్ నటించిన 'లై', స్టైలిష్‌స్టార్ అల్లుఅర్జున్ నటించిన 'నా పేరు సూర్య...నా ఇల్లు ఇండియా' చిత్రాలలో కీలకపాత్రలు పోషించాడు. ఇక ఆయనకు నటునిగానే కాదు దర్శకునిగా, నిర్మాతగా కూడా ఎంతో పేరుంది. 'జైహింద్' వంటి ఎన్నో దేశభక్తి చిత్రాలను ఈయన తీశాడు.
ఇక ఈయన నటిస్తున్న 150వ చిత్రంగా 'కురుక్షేత్రం' విడుదలకు సిద్దమవుతోంది. ప్రసన్న, వరలక్ష్మి శరత్‌కుమార్, వైభవ్, సుహాసిని, శృతి హరిహరణ్‌లు ఈ చిత్రంలో నటించారు. ఇక అర్జున్ నిజజీవితంలో కూడా మార్షల్ ఆర్ట్స్ తెలిసిన వ్యక్తి కావడమే కాదు.. ఆయనకు పోలీస్ పాత్రలు బాగా అచ్చివచ్చాయి. ఇలా ఈయన తన 150వ చిత్రంలో కూడా పోలీస్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రం తమిళంలో ఆల్‌రెడీ 'నిబునన్' పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగులో 'కురుక్షేత్రం' గా విడుదల కానుండగా, ఈ చిత్రం ట్రైలర్‌ని నేచురల్ స్టార్ నాని విడుదల చేశాడు. ఇక పోలీసులు అంటే మిగిలిన వారు ఓ విషయాన్ని చూసే దృష్టి ఒక రకంగా ఉంటే పోలీసులు చూసే కోణం వేరుగా ఉంటుంది. అదే ఈ చిత్రం ట్రైలర్‌లో చూపించే ప్రయత్నం చేయడం విశేషం.
'చూసే వాళ్ల దృష్టిని బట్టి పెయింటింగ్ అర్ధం మారుతుంది. ఈ పెయింటింగ్ చూసి ఏమి అర్ధమైందో చెప్పండి' అని హీరో అర్జున్‌ని భార్య అడుగుతుండగా, దానికి పోలీస్ అధికారి అయిన అర్జున్ 'ఇదిగో నీలం కనిపిస్తోంది.... ఇది కొలను. ఇక్కడ ఓ హత్య జరిగింది. ఆ తెట్టుతెట్టుగా కనిపిస్తోంది అదే రక్తం. ఆ కత్తి పట్టుకుని వెళ్తున్నాడే అతనే హత్య చేసి వెళ్తున్నాడు'.. అంటూ చెబుతాడు. ఓ పోలీస్ వాడికి రాకూడని వ్యాధి ఇది అనే డైలాగ్ కూడా వినిపిస్తోంది. 'మనం ఎలా చూస్తున్నామో వాడూ అలానే ఆలోచిస్తున్నాడు. కాబట్టి మనం వాడికంటే ముందుండాలి' అంటూ సాగిన ఈ ట్రైలర్‌ని చూస్తే ఇదో సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ అని అర్ధమవుతోంది. కాగా ఈ చిత్రానికి అరుణ్ వైద్యనాథన్ దర్శకత్వం వహించాడు.