ఏ సమస్యనైనా గుర్తించడం అనేది గొప్పే గానీ సమస్యలను తెలుసుకోవడం కాదు...దానికి పరిష్కారాలను సూచించే వారే నిజమైన నాయకులు, మేధావులుగా చెప్పుకోవాలి. ఈ విషయంలో పవన్ తాజాగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై చేసిన వ్యాఖ్యలు ఎంతో ఆలోచనీయంగా ఉన్నాయి. మరలా జనసేనాధిపతి తన పోరాట యాత్రను ప్రారంభించనున్న సందర్భంగా ఉత్తరాంధ్ర వెనుకబాటుతనంపై మేధావులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ప్రొఫెసర్ కె.ఎస్.చలం, ప్రొఫెసర్ కెవి రమణ, ప్రజాగాయకుడు వంగపండు, వామపక్ష మేధావులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పవన్‌కళ్యాణ్ మాట్లాడుతూ,స్థానికుల సమస్యలను రాజకీయ నాయకులు పరిగణనలోకి తీసుకోవాలి. నాయకులు ఈ విషయాన్ని వెంటనే అర్ధం చేసుకోవాలి. ఉత్తరాంధ్రలో ఎంతో వెనుకబాటుతనం ఉంది. ఈ విషయాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్తాను. సమస్యలు గుర్తించి, పరిష్కరించకపోతే మరోసారి విభజన సమస్య వస్తుంది. అలా జరిగితే ఇంకా చాలా నష్టపోతాం. ఏజెన్సీ ప్రాంతంలో తీవ్ర ఆరోగ్యసమస్యలున్నాయి. వైద్యులు అందుబాటులో ఉండటం లేదు. ఇటీవల నేను అరకు వెళ్లినప్పుడు ఎంతో మంది చిన్నారులను చూశాను. రక్తహీనత, రేచీకటి, చర్మసంబంధ వ్యాధులతో వారు ఎంతో బాధపడుతున్నారు. నా కుమారుడి వయసు ఉన్న పిల్లలను చేతితో తడిమి చూశాను. ఒళ్లంతా చర్మవ్యాధులతో వారు బాధపడుతూ ఉండటం గమనించాను. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నప్పటికీ వైద్యులు లేరు. అంబులెన్స్‌లు లేవు. ఉత్తరాంధ్ర సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తానని పవన్ వెల్లడించాడు.
పవన్ చెప్పిన సమస్యల కన్నా ఏజెన్సీ ప్రాంతాలలో ఇంకా చెప్పుకోలేనన్ని సమస్యలు ఉన్నాయి. విషజ్వరాలతో పాటు సీజనల్ వ్యాధులు వారిని పీడిస్తున్నాయి. ఎజెన్సీ ప్రాంతాలను ప్రభుత్వాలు తరాల కొద్ది నిర్లక్ష్యం చేయడం వల్లే వారు నక్సలైట్ల వంటి వారి పట్ల ఆకర్షితులవుతున్నారని ఇంతకాలం మనల్ని ఏలిన నాయకులు గుర్తించలేకుండా ఉన్నారు. వారు నక్సలిజంను శాంతిభద్రతల సమస్యగా చూస్తున్నారే గానీ వాటికి కారణమైన మూలాలను మర్చిపోతున్నారు. ఏ ప్రాంతం నాయకులు అధికారంలో ఉన్నా, ఎమ్యేల్యేలు, ఎంపీలు, మంత్రులుగా ఉన్నా కూడా వారు ఈ సమస్యలను పరిష్కరించడం లేదు. రిజర్వేషన్ల కోటాలో అధికారం చేపట్టిన ఆయా ప్రాంతవాసులే వారిని పట్టించుకోనప్పుడు ఎవ్వరినీ నిందించే పరిస్థితి లేదనే చెప్పాలి.
అయినా పవన్ ఈ సమస్యను గుర్తించి మోదీ వద్దకు సమస్యలను తీసుకెళ్తానని ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటే ఆయనకు అందరు జై కొడతారనడంలో ఆశ్చర్యం లేదు. కానీ టిడిపి నాయకులు మాత్రం పవన్ వ్యాఖ్యలను రాజకీయరంగు పులుముతూ పవన్ వ్యాఖ్యలు విభజనను రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ఆరోపించడం తప్పితే సమస్యల తీవ్రతను మాత్రం పట్టించుకోవడం లేదు.