ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఫుల్ ఫామ్ తో దూసుకుపోతున్నాడు. వరసగా హిట్స్ కొడుతున్న ఎన్టీఆర్ ప్రస్తుతం అజ్ఞాతవాసి వంటి డిజాస్టర్ చేసిన త్రివిక్రమ్ తో అరవింద సమేత చిత్రాన్ని చేస్తున్నాడు. అజ్ఞాతవాసి అంతటి ప్లాప్ అయినప్పటికీ.. ఎన్టీఆర్ కున్న క్రేజ్ తో ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ అరవింద సమేత మీద ట్రేడ్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే అరవింద సమేతలో ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్ కి విశేష స్పందన రావడం.. ఈ సినిమాపై రోజురోజుకి ప్రేక్షకుల్లో క్రేజ్ పెరగడంతో.. ఈ సినిమా థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్లో మొదలైందని టాక్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ఈదెబ్బతో యంగ్ టైగర్ 100 అంటే సెంచరీ కొట్టడం ఖాయంగానే కనబడుతుంది.
స్టార్ హీరోస్ అంతా ఎప్పుడో 100 కోట్ల క్లబ్బులో జాయిన్ అయితే ఎన్టీఆర్ మాత్రం ఇంకా 80 దగ్గరే ఆగిపోయాడు. ఈసారి అరవింద సమేతలో ఎన్టీఆర్ సెంచరీ కొట్టడం ఖాయమనే మాట మాత్రం గట్టిగా వినబడుతుంది. తాజాగా ఎన్టీఆర్ అరవింద సమేత కి జరుగుతున్న బిజినెస్ లెక్కలు ఎన్టీఆర్ 100 కొట్టడం పక్కా అంటున్నారు. ప్రస్తుతానికి భారీ బడ్జెట్ మూవీగా హారిక అండ్ హాసిని వారు తెరకెక్కిస్తున్న అరవింద సమేత తప్ప ఈ దసరా బరిలో దిగే మరో పెద్ద చిత్రం కనబడకపోవడంతో... అరవింద సమేతకి భారీ ఎత్తున థియేట్రికల్ బిజినెస్ మొదలైంది. ఇప్పటికే ఆంధ్ర హక్కులను 40 కోట్లకు డిస్ట్రిబ్యూటర్స్ తన్నుకుపోయినట్లుగా తెలుస్తుంది. ఆంధ్రాలో ముందుగా తూర్పు, పశ్చిమ, నెల్లూరు బిజినెస్ పూర్తయిందని... చెబుతున్నారు.
ఇక ఆంధ్రాలోనే ఈ రేంజ్ బిజినెస్ అంటే... నైజాం, సీడెడ్ లలో అరవింద హక్కులు 30 నుండి 35 మధ్యలో ఉండే అవకాశం ఎక్కువగా వుంది. మరి ఈ లెక్కన ఆంధ్రా లో 40 ఇటు నైజం, సీడెడ్ లలో 30 అనుకోండి.. మొత్తంగా కలిపి రెండు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 70 కోట్లకి... ఓవర్సీస్ లో ఓ 20 కోట్లు, మిగతా అంటే తమిళనాడు, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా ఇలా అన్ని కలిపి మరో 10 ఏసుకున్నా అంతా కలిపి 100 పూర్తవుతుంది. సో అరవింద సమేతతో ఎన్టీఆర్ 100 కోట్ల క్లబ్బులో అడుగుపెట్టి.. సినిమా హిట్ అయితే మరో పది కోట్లతో అంటే 110 కోట్లతో ఎన్టీఆర్ జయకేతనం ఎగరేస్తాడనే న్యూస్ కె.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి. ఇక థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్, ఎన్టీఆర్ తండ్రి పాత్రలో మెగా హీరో నాగబాబు కనిపించనున్నాడు.