వినాకుడి పెళ్లికి అడుగడుగునా విఘ్నాలే అన్నట్లుగా నేటి ఇండియన్ సూపర్‌స్టార్ ప్రభాస్ పెళ్లి వ్యవహారం మారింది. ఈయన 'బాహుబలి'తో నేషనల్ ఐకాన్‌గా మారాడు. ప్రస్తుతం 'సాహో' చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఇండియాలోని మోస్ట్ డిజైరబుల్ బ్యాచ్‌లర్స్‌లో ప్రభాస్ కూడా ఒకడని చెప్పాలి. కానీ ప్రభాస్ తన పెళ్లి వ్యవహారం ప్రస్తావనకు వస్తే వచ్చే ఏడాది అంటూ 'ఓ స్త్రీ రేపురా' అన్నట్లుగా సమాధానం చెబుతాడు. ఇదిగో పెళ్లి చేసుకుంటున్నానని చెప్పాడు. కానీ ఆ తర్వాత మాట మార్చాడు. 'బాహుబలి' చిత్రం పూర్తయ్యాక వివాహం చేసుకుంటానన్నాడు. ఇప్పుడు మరలా చూద్దాం అంటున్నాడు.
ఇక ప్రభాస్ పెళ్లి వేడుకను కనులారా చూడాలని ఆయన కుటుంబ సభ్యులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రభాస్ పెదనాన్న రెబెల్‌స్టార్ కృష్ణంరాజు కూడా ఇదిగో ప్రభాస్ పెళ్లి.. అదిగో పెళ్లి అని కాలక్షేపం చేస్తున్నాడు. ప్రభాస్ ప్రస్తావన వచ్చిందంటే చాలు మీడియా ప్రభాస్ పెళ్లి గురించి ఆయనను అడగకా మానదు.. ఆయన దానిపై స్పందించకా మానడు. ఇక తాజాగా కూడా కృష్ణంరాజు ప్రభాస్‌పెళ్లి విషయంలో స్పందించాడు. ప్రభాస్ ఏమైనా చిన్నపిల్లవాడా? బలవంతంగా పెళ్లి చేయడానికి? ముప్పై ఏళ్లు దాటి ఎప్పుడో అయింది. పెళ్లి విషయం ప్రభాస్ తనకి తాను ఆలోచించుకోవాలి. పెళ్లి చేసుకో? ఎప్పుడు చేసుకుంటావు? అని మేము అడుగుతూనే ఉంటాం. ప్రతి సారి ఇదిగో చేసుకుంటాను.. అనే చెబుతూ ఉంటాడు.
ఇక మా కుటుంబంలో నియమం ఏమిటంటే.. ఐదేళ్లలోపు పిల్లలు దేవుళ్లుగా చూడాలి. 18ఏళ్ల వరకు బానిసలుగా చూసి, దారిలో పెట్టాలి. 18ఏళ్లు దాటిన తర్వాత స్నేహంగా ఉండాలి అనేది తమ సిద్దాంతంగా తెలిపాడు. ప్రభాస్ నటునిగా బాగా ఎదిగాడని, మోదీ కూడా 'బాహుబలి'ని ప్రభాస్‌ని మెచ్చుకున్నాడని, ప్రస్తుతం ఆయన చేస్తోన్న 'సాహో' చిత్రం తర్వాత నాసొంత చిత్రంలో ప్రభాస్ నటిస్తాడని, ఈ చిత్రం జూలై లేదా ఆగష్టులలో ప్రారంభిస్తామని కృష్ణంరాజు చెప్పుకొచ్చాడు. మొత్తానికి ప్రభాస్ వివాహం విషయంలో ఆయన పెదనాన్నకు కూడా చిరాకు వచ్చిందనే సెటైర్లు వినిపిస్తున్నాయి.