ఈమధ్యన గోపీచంద్ కి అస్సలు కాలం కలిసి రావడం లేదు. గత కొన్నాళ్లుగా రొటీన్ రోడ్డ కొట్టుడు అనే టైప్ లో సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. మాస్ మాస్ అంటూ గోపీచంద్ తన కెరీర్ ని కష్టాల్లో పడేసుకున్నాడు. యావరేజ్ హిట్స్ ఇచ్చే సంపత్ నంది కూడా గోపిచంద్ ని కాపాడలేకపోయాడు. ఇక గోపీచంద్ సినిమాలకు మార్కెట్ విపరీతంగా పడిపోయింది. ఆక్సిజన్, గౌతమ్ నంద, ఆరడుగుల బుల్లెట్ వంటి సినిమాలతో ప్లాప్స్ మీదున్న గోపీచంద్ తాజాగా తన కెరీర్ లోనే మైలు రాయిగా నిలిచిపోయే... 25 వ చిత్రాన్ని చక్రవర్తి డైరెక్షన్ లో మెహ్రీన్ కౌర్ తో కలిసి పంతం చేశాడు. మరి తాజాగా విడుదలైన పంతం ట్రైలర్ చూస్తుంటే.. గోపీచంద్ పంతం మీదున్నాడు అనిపిస్తుంది.
రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాలో తీసినట్టుగా కనిపిస్తున్నా ఈ సినిమాలో ఏదో ఉందనే ఆసక్తి మాత్రం కలుగుతుంది. హ్యాపీగా లైఫ్ ని గడిపేస్తున్న కుర్రాడు... ఒక మంచి పనికోసం ఎవరికి అనుమానం రాకుండా దొంగతనాలు చేసేవాడిగా గోపిచంద్ పాత్రను చక్రవర్తి డిజైన్ చేశాడు. మరి ఈ స్టోరీ లైన్ చూస్తుంటే ఎప్పుడో.. మాస్ మహారాజ్ రవితేజ నటించిన కిక్ సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాలో రవితేజ ఉల్లాసంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ కిక్ కోసం నలుగురిని ఆదుకోవడానికి దొంగతనాలు చేస్తూ హాస్యం పండిస్తాడు. మరి పంతం సినిమా లో కూడా గోపీచంద్ మంచి పనికోసం దొంగతనాలు చేస్తుంటాడు. 'కురుక్షేత్రం యుగానికి ఒక్కసారే జరుగుతుంది. ధర్మం వైపు నిలబడాలో.. అధర్మం వైపు నిలబడాలో.. నిర్ణయం అప్పుడే తీసుకోవాలి'. 'ఒక అవినీతి నాయకున్ని అరెస్ట్ చేస్తే.. బ్యాండ్ లు చేస్తాం, ధర్నాలు చేస్తాం, బస్సులు తగలెట్టేస్తాం అంటూ ప్రతి ఒక్కడు రోడ్డెక్కేస్తాడు.. ఏయ్ వాడు కాజేస్తున్నది నీ అన్నాన్ని, నీ బతుకుని రా అంటూ ఎమోషనల్ గా గోపీచంద్ చెప్పే బలమైన డైలాగ్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఇక హీరోయిన్ మెహ్రీన్ కౌర్ హీరో చుట్టూ తిరుగుతూ గోపీచంద్ ని పడేసే క్యారక్టర్ లో గ్లామర్ డోస్ పెంచింది. ఇక యాక్షన్ కి యాక్షన్, కామెడీకి కామెడీ సమపాళ్లలో ఉన్న ఫీలింగ్ అయితే ఈ ట్రైలర్ ని చూస్తుంటే కలుగుతుంది.
మరి గోపిసుందర్ అందించిన మ్యూజిక్ పర్వాలేదనిపించినా... నేపధ్య సంగీతం మాత్రం బావుంది. సంపత్ రాజ్, జీవా, అజయ్, షాయాజీ షిండే, శ్రీనివాస రెడ్డి, పృథ్వి, హంసానందిని. వంటి నటీనటుల పాత్రలను దర్శకుడు బలంగా రాసుకున్నాడనిపిస్తోంది. మరి ఈ సినిమాతో గోపీచంద్ మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కేలాగే కనిపిస్తున్నాడు.
Click Here to Pantham Movie Trailer