కొన్ని విషయాలలో మన స్టార్స్ కంటే బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ కాస్త ఓపెన్‌గా ఉంటారు. తమకు చదువు లేకపోతే దానిని నిజాయితీగా ఒప్పుకుంటారు. రజనీకాంత్, కమల్‌హాసన్‌లు సైతం తమకు పెద్దగా చదువు రాదని ఓపెన్‌గా చెప్పారు. కానీ మన హీరోలు మాత్రం అంత ఓపెన్‌గా తమ వ్యక్తిగత విషయాలను బయటకి తెలియనివ్వకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఫలానాది తమకు రాదు అంటే అదేదో చులకనగా చూస్తారనే భ్రమలో ఉంటారు. ఇక కోలీవుడ్‌లోని పలువురికి హిందీ కూడా సరిగా రాదు. వారు కేవలం తమ మాతృభాష అయిన తమిళం గొప్పతనం గురించే చెబుతారు. దేశ భాషగా హిందీని వారు ఎప్పటినుంచో వ్యతిరేకిస్తూ, హిందీని నేర్చుకోవద్దని బహిరంగంగానే స్టేట్‌మెంట్స్ ఇస్తూ ఉంటారు.
ఇక విషయానికి వస్తే 'బాహుబలి' చిత్రం ద్వారా అందరికీ ఎంత పేరు వచ్చిందో దేశవిదేశాలలో కట్టప్పగా నటించిన సత్యరాజ్‌కి అంత గొప్ప పేరు వచ్చింది. ఈయన తాజాగా కార్తి హీరోగా నటిస్తున్న 'చినబాబు' చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం వేడుక సందర్భంగా సత్యరాజ్ నిజాయితీతో కూడిన ప్రసంగం అందరిని ఎంతో ఆకట్టుకోవడమే కాదు.. నవ్వులు కూడా పూయించింది. ఆయన మాట్లాడుతూ, నేను డిగ్రీలో బిఎస్సీ చేశాను. అది కూడా ఇంగ్లీషు మీడియంలో. కానీ నాకు ఇంగ్లీషు అక్షరముక్కరాదు. ఓ సారి మా ప్రొఫెసర్ నాలుగు ఇంగ్లీషు ముక్కలు కూడా మాట్లాడలేవా? అని ఎద్దేవా చేశాడు.
దానికి నేను సమాధానం ఇస్తూ తమిళనాడుకి 50కిలోమీటర్ల బోర్డర్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కి చెందిన తెలుగే రాదు. మరి ఎనిమిది వేల కిలోమీటర్లు ఉన్న లండన్ ఇంగ్లీషు నాకేం వస్తుందని సమాధానం చెప్పానని అన్నాడు. బికాంలో ఫిజిక్స్‌లు చదివేవారి కంటే తమకు రాని దానిని రాదని ఒప్పుకునే పెద్ద మనసు ఎంత మందికి ఉంటుంది చెప్పండి....!