విదేశాలలో, బాలీవుడ్‌లో బిగ్‌బాస్ బాగా సక్సెస్ కావడానికి ఆయా ప్రేక్షకులు, వారి సంప్రదాయాలు, సంస్కృతులకు దగ్గరగా ఉండటం కూడా ఓ కారణమనే చెప్పాలి. కానీ అదే మన దక్షిణాదికి వచ్చేసరికి పరిస్థితి మారుతోంది. ముఖ్యంగా తమదైన సంప్రదాయాలు, సంస్కృతుల విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండే తమిళ ప్రజలకు ఇది మింగుడుపడటం కాస్త కష్టమే. ఏకంగా లోకనాయకుడు కమల్‌హాసన్ మొదటి సీజన్‌ని హోస్ట్ చేసినా కూడా ఆదరణ అంతంత మాత్రంగానే వచ్చింది. తెలుగుతో పోల్చుకుంటే పెద్దగా టీఆర్పీలు కూడా సాధించలేకపోయింది. అయినా సీజన్2ని కూడా మరలా కమల్‌హాసనే హోస్ట్ చేస్తున్నాడు.
ఇక ఈ రెండో సీజన్ విషయానికి వస్తే షో ప్రారంభంలో ఎంతో ఉత్సాహంగా ఉన్న పార్టిసిపెంట్స్ రోజులు జరిగే కొద్ది బాగా బద్దకస్తులుగా తయారయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక తాజాగా ఈ షో పార్టిసిపెంట్స్‌లో ఇద్దరు మహిళలైన జనని, ఐశ్యర్యల మధ్య లిప్‌లాక్ సీన్ హైటైట్‌గా మారింది. దీనిపై తమిళ సంప్రదాయ వాదులు, తమిళ సంఘాలు మండిపడుతున్నాయి. హాలీవుడ్, బాలీవుడ్‌కే పరిమితమైన లెస్బినిజం టైప్‌లో ఇద్దరు మహిళల మధ్య లిప్ లాక్ ఏమిటంటూ వారు మండిపడుతున్నారు.
ఇక టాస్క్‌లో భాగంగా ముంతాజ్, బాలాజీలు డైపర్లు వేసుకుని చిన్నపిల్లల్లా ప్రవర్తించారు. జనని, వైష్ణవి మీసాలు పెట్టుకుని మగాళ్లలా, ఐశ్వర్య, రమ్య ట్విన్స్‌లా ఇతర హౌస్‌మేట్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. మొత్తానికి వివాదాల సంగతి పక్కనపెడితే తమిళ బిగ్‌బాస్ రోజు రోజుకు రంజుగా మారుతోంది. అంతకు మించి అనిపించేలా ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తోంది. ఈ సీజన్ మొదటి సీజన్ కంటే ప్రేక్షకులను బాగా ఎంటర్‌టైన్ చేస్తూ ఉండటం విశేషం.