కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి ఎంతమంది అభిమానులైతే ఉన్నారో... ఆ తర్వాతి స్థానంలో ఇళయదళపతి విజయ్ కి అభిమానులు ఉంటారు. ఇప్పుడు విజయ్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా విజయ్ మురుగదాస్ డైరెక్షన్ లో తన 62 ఫిలింలో నటిస్తున్నాడు. మురుగదాస్ - విజయ్ సినిమా టైటిల్ 'సర్కార్' అంటూ ప్రకటన చెయ్యడమే కాదు.. నిన్న విజయ్ పుట్టినరోజు కానుకగా చిత్ర బృందం సర్కార్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ తో విజయ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసారు. ఇక సర్కార్ లుక్ లో విజయ్ సిగార్ తాగుతూ అలా కూర్చుని ఉంటే... అబ్బా విజయ్ ఫోజ్ ఏముందిరా అనేలా అనిపిస్తుంది. సర్కార్ లో విజయ్ స్టైలిష్ లుక్ చూసిన విజయ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
అయితే మురుగదాస్ - విజయ్ ల కాంబోలో తెరకెక్కుతున్న సర్కార్ లుక్ కి ఎంతగా రెస్పాన్స్ వచ్చిందో.. అనేది సోషల్ మీడియాలో వచ్చిన లైక్స్, షేర్స్ చూస్తుంటే తెలుస్తోంది. అయితే ఇప్పుడు మురుగదాస్ - విజయ్ ల సర్కార్ లుక్ మీద తమిళనాట వ్యతిరేకత మొదలైంది. సర్కార్ లుక్ లో విజయ్ సిగార్ తాగుతూ కనిపించడంతోనే సమస్య మొదలైంది. తమిళ ఎంపీ అయిన మాజీ ఆరోగ్యశాఖామంత్రి అన్బుమని రామదాస్.. ఈ సర్కార్ పోస్టర్ విజయ్ సిగార్ తాగే లుక్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా పోస్టర్ ద్వారా సిగరెట్ బ్రాండ్ ని నువ్వు ప్రమోట్ చేస్తున్నావా..... నువ్వు ఇలా చేయడం నిజంగా సిగ్గుచేటు. ఒక హీరోగా స్మోకింగ్ చేస్తే ఎన్ని అనర్ధాలు వస్తాయో.. అనేది చెప్పాల్సిన నువ్వు ఇలా సిగరెట్ తాగుతూ ప్రజలకు ఏమ్ చెప్పాలనుకుంటున్నావ్..అంటూ ఎప్పుడు సినిమాల్లో సిగరెట్ తాగనని గతంలో నువ్వు చెప్పావు.. కానీ ఇప్పుడు నువ్వు చేస్తున్నదేమిటి అంటూ... అన్బుమని రామదాస్, విజయ్ మీద విరుచుకుపడ్డారు. అయితే అన్బుమని రామదాస్ ఇలాంటి వ్యాఖ్యలు చెయ్యడంతో.. ఆయన మీద విజయ్ ఫ్యాన్స్ గుర్రుగా వున్నారు.
మరి ఫస్ట్ లుక్ కే ఇలాంటి నిరసనలు మొదలు పెడితే.. సినిమా పూర్తయ్యి విడుదలయ్యాక మరెంతగా ఈ విషయం హాట్ టాపిక్ గా వుంటుందో అనేది విజయ్ అభిమానులను ఆందోళన కలిగిస్తున్న విషయం. ఇక విజయ్ గత సినిమా మెర్సల్ విషయంలోనూ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మెర్సల్ సినిమాలో డాక్టర్స్ ని కించపరిచే విధంగా కొన్ని సీన్స్ ఉన్నాయంటూ సినిమా విడుదలయ్యాక డాక్టర్స్ బ్యాచ్ అంతా ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. అలాగే జీఎస్టీ మీద ఉన్న డైలాగ్స్ విషయంలో బిజెపి పెద్ద రాద్దాంతమే చేసింది.