తెలుగు సినీరచయితల్లో పరుచూరి బ్రదర్స్‌ది ప్రత్యేకమైన స్థానం. నేటి రచయితలు నాలుగైదు చిత్రాలకే తమ కలంలో పదును కోల్పోతూ, అన్యమనస్కంగా రచయితలుగా పేలవంగా మాట్లాడుతున్నారు. మరికొందరు నాలుగైదు సినిమాలకు రచయితలుగా పనిచేసిన వెంటనే తొందరపడి దర్శకులుగా మారుతున్నారు. కానీ పరుచూరి బ్రదర్స్ మాత్రం అప్రతిహతంగా దాదాపు మూడు నాలుగు జనరేషన్లను వారికి తగ్గ కథలతో బ్లాక్‌బస్టర్స్ ఇస్తూ తమ సత్తా చాటారు.
తాజాగా పరుచూరి గోపాలకృష్ణ ఓ గొప్పదర్శకుడిని గుర్తు చేసుకున్నారు. ఆయన ఎవరో కాదు.. పి.సి.రెడ్డి. పి.చంద్రశేఖర్‌రెడ్డిగా సూపర్‌స్టార్ కృష్ణకు ఎదురేలేనిహిట్స్‌ని ఆయన అందించారు. ఆయన గురించి పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, దాసరినారాయణరావు, కె.రాఘవేంద్రరావుల తరహాలో పి.సి.రెడ్డిగారు కూడా అద్భుతమైన దర్శకులు. 1972లో ఆయన 'బడిపంతులు, ఇల్లు ఇల్లాలు, పాడిపంటలు, మానవుడు దానవుడు' వంటి వరుస హిట్స్‌ని ఇచ్చారు. ఆయన తీసిన ప్రతి చిత్రం పాతిక వారాలు ఆడింది. అంతటి మహానుభావుడు ఆయన. అంతటి గొప్ప దర్శకుడు నాలోని రచయితని గుర్తించారు. నువ్వు గొప్ప రచయితవి అవుతావంటూ నాకు ధైర్యం చెప్పారు.
'మానవుడు మహనీయుడు' చిత్రంలో మాటలను మాత్రమే కాదు మూడు పాటలను కూడా ఆయన నాతో రాయించారు. నువ్వు తప్పకుండా పైకి వస్తావు... ఇండస్ట్రీకి వచ్చేయ్ అని భరోసా ఇచ్చారు. ఆయన ఎంతో మంచి మనిషి. మాకు పేరు పెట్టి అక్షరాభాస్యం చేయించింది ఎన్టీఆర్.. వరుసగా చాన్స్‌లు ఇచ్చి ప్రోత్సహించింది కృష్ణ అయితే... మాకు వరుసగా అవకాశాలు ఇచ్చి మమ్మల్ని ఇండస్ట్రీకి రమ్మని భరోసా ఇచ్చింది పి.సి.రెడ్డి అని చెప్పుకొచ్చారు.