యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాల్లోనే అంటే వెండితెర మీదే యంగ్ టైగర్ కాదు.. బుల్లితెర మీద కూడా యంగ్ టైగర్ అనిపించుకున్నాడు. గత ఏడాది బిగ్ బాస్ తో బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తన యాంకరింగ్ తో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టాడు. అయితే బిగ్ బాస్ సీజన్ వన్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈసారి కాస్త బిజీ షెడ్యూల్ వల్ల సీజన్ 2 కి యాంకరింగ్ చెయ్యడం లేదు. మరి ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యానంతో తాజాగా నాని చేస్తున్న బిగ్ బాస్ 2 హోస్టింగ్ ఎవరికీ పెద్దగా కనెక్ట్ కావడం లేదు. ఎన్టీఆర్ ముందు నాని తేలిపోయాడనే కామెంట్స్ సోషల్ మీడియా సాక్షిగా ఇంకా పడుతూనే ఉన్నాయి.
అయితే బిగ్ బాస్ వ్యాఖ్యానంతో ఎన్టీఆర్ ప్రస్తుతం మనకి దూరమైనా.. ఎన్టీఆర్ తాజాగా మరో షో ద్వారా బుల్లితెర మీద అడుగుపెట్టబోతున్నాడు. అది కూడా ఈ టివి లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఢీ 10 కోసం. ఈ టివి బాగా పాపులర్ అయిన ఢీ 10 షో గ్రాండ్ ఫినాలే కోసం ఎన్టీఆర్ మళ్ళీ బుల్లితెర మీద అడుగుపెట్టబోతున్నాడు.. కాదు కాదు పెట్టేశాడు. తాజాగా ఢీ 10 గ్రాండ్ ఫినాలే అంగరంగ వైభవంగా జరిగింది. ఆ షోకి గెస్ట్ గా ఎన్టీఆర్ విచ్చేశాడు. ప్రస్తుతం ఈ టివి ఛానల్ లో సెమి ఫైనల్స్ జరుగుతున్న ఈ షోకి సంబందించిన ఫైనల్స్ జరిగిపోయింది కానీ.. ఈ ఫైనల్ ఎపిసోడ్ ని వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ప్రసారం చెయ్యబోతున్నారు.
మరి డాన్స్ లో కింగ్ అయిన ఎన్టీఆర్ ఇలా ఒక డాన్స్ షోకి గెస్ట్ గా వచ్చి అందులో గెలిచిన విన్నర్ కి తన చేతుల మీదుగా ఢీ 10 ట్రోఫీని అందించాడు ఎన్టీఆర్. ఇక ఎన్టీఆర్ చేతుల మీదుగా ట్రోఫీ అందుకున్న ఆ విన్నర్ కి జన్మ ధన్యమైపోయిందేమో అనేది బుల్లితెర మీద చూసేవరకు సస్పెన్స్. ఇక ఈ షోకి మొదటినుండి శేఖర్ మాష్టర్, యాని మాస్టర్, హీరోయిన్ ప్రియమణి న్యాయ నిర్ణేతలుగా ఉంటున్నారు. ఇక శేఖర్, యాని, ప్రియమణితో కలిసి ఎన్టీఆర్ ఇలా ఢీ 10 గ్రాండ్ ఫినాలే లో బాగా సందడి చేశాడన్నమాట.