'బాహుబలి' చిత్రంలో దేవసేన పాత్రకు ప్రముఖుల ప్రశంసలతో పాటు అంతర్జాతీయంగా కూడా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది స్వీటీ అనుష్క. ఈ చిత్రానికిగాను ఆమెకి ఎన్నో అవార్డులు, రివార్డులు లభించాయి. ఈ సినిమాకి గాను 'బిహైండ్ వుడ్స్‌గోల్డ్‌మెడల్' ఉత్తమనటి అవార్డును ఆమె దక్కించుకుంది. ఇదే సినిమాకి ఉత్తమ కాస్ట్యూమర్ డిజైనర్స్‌గా రమారాజమౌళి, ప్రశాంతిలు కూడా అవార్డులు గెలుచుకున్నారు. ఉత్తమ సహాయనటిగా రమ్యకృష్ణ, ఉత్తమ దర్శకునిగా రాజమౌళి ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. దేవసేన పాత్రకు నన్ను ఎంచుకున్న రాజమౌళిసార్‌కి కృతజ్ఞతలు, అభిమానులు ప్రోత్సాహమే నన్ను నిరంతరం నడిపిస్తూ ఉంటుంది అని తెలిపింది. ఈ సందర్భంగా ఆమెకి బాహుబలి ప్రభాస్ భుజాలపై నడుచుకెళ్లడం సమంజసమేనా? అనే ప్రశ్న ఎదురైంది. దానికి స్వీటీ సమాధానం ఇస్తూ.. మరొకరి భుజాలపై నడవడం తప్పే. కానీ బాహుబలి చిత్రంలో అలాంటి పాత్ర పోషించడం దేవసేన తప్పుకాదు అని చెప్పుకొచ్చింది.
ఇక 'బాహుబలి' సమయంలోనే అనుష్క.. జి.అశోక్ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బేనర్‌పై రూపొందిన 'భాగమతి' చిత్రం ఒప్పుకుంది. ఈ చిత్రం ఈ ఏడాది రిపబ్లిక్‌డే కానుకగా విడుదలై ఈ ఏడాది తొలి హిట్‌గా నిలిచింది, 'భాగమతి' తర్వాత అనుష్క పెళ్లి చేసుకోనుందని అందుకే చిత్రాలు ఒప్పుకోవడం లేదని ప్రచారం సాగుతోంది. కానీ ఇదే సమయంలో ఆమె గౌతమ్‌మీనన్‌తో ఓ చిత్రం చేయనుందని సమాచారం.