మహేష్ రెండు డిజాస్టర్ల తర్వాత 'భరత్ అనే నేను'తో బ్లాక్‌బస్టర్ కొట్టి ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. ఈ మధ్య వచ్చిన విరామంలో ఆయన విదేశాలలో వెకేషన్స్ కి వెళ్లి ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేశాడు. ఇక మహేష్ ఇండియా రావడం, తన ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రాన్ని ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో ప్రారంభించడం జరిగిపోయాయి. ఈ చిత్రాన్నిదిల్‌రాజు-అశ్వనీదత్‌లు సంయుక్తంగా నిర్మిస్తుండగా, పూజాహెగ్డే ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్ డెహ్రాడూన్‌లో జరుగుతుండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ షూటింగ్ స్పాట్‌కి వచ్చారు.
ఇలా ఉత్తరాఖండ్ సీఎం స్వయంగా వచ్చి 'భరత్ అనే నేను' అని ఈ మధ్యనే వెండితెరపై ప్రమాణ స్వీకారం చేసిన యువ ముఖ్యమంత్రి మహేష్‌ని కలుసుకున్నాడు. ఇలా ముఖ్యమంత్రి షూటింగ్ స్పాట్‌కి రావడంతో మహేష్‌బాబు కూడా నవ్వుతో ఆయనతో ముచ్చట్లాడారు. ఈ సందర్భంగా ఆయన టోపీతో మీసాలు గడ్డాలు పెంచి కనిపిస్తూ విశేషంగా ఆకట్టుకుంటున్నాడు. ఇంకా టైటిల్‌ని ఖరారు చేయని ఈ చిత్రానికి వంశీపైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోపక్క ఈ సినిమాని వెంటనే సెట్స్‌పైకి తీసుకెళ్లి షూటింగ్ జరుపుతున్న జోరు చూస్తుంటే దీనిని కూడా సంక్రాంతి కానుకగానే విడుదల చేస్తారని అంటున్నారు.
గతంలో మహేష్‌బాబు హీరోగా దిల్‌రాజు నిర్మాతగా వచ్చిన 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం కూడా సంక్రాంతికే విడుదలై ఘనవిజయం సాధించింది. మరోవైపు వచ్చే సంక్రాంతికే ఈ పండుగ బాగా అచ్చివచ్చే బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్‌తో రానున్నాడు. మరోవైపు దానయ్య నిర్మాతగా రామ్‌చరణ్ హీరోగా బోయపాటిశ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రం కూడా సంక్రాంతి కానుకగానే రానుంది. మరి మహేష్ చిత్రం కూడా ఇదే పండుగకు వస్తే 'రంగస్థలం, భరత్ అనే నేను' చిత్రాల తర్వాత మరోసారి రామ్‌చరణ్, మహేష్‌లు పోటీ పడటం ఖాయంగా కనిపిస్తోంది.