అమలాపాల్.. ఈమె వ్యక్తిగత జీవితంలో, వృతిపరమైన జీవితంలో ఉన్నన్ని వివాదాలు మరో నటిపై లేవనే చెప్పాలి. సుచీలీక్స్ నుంచి ధనుష్‌తో ఎఫైర్, హడావుడిగా దర్శకుడు ఎ.ఎల్.విజయ్‌తో వివాహం, అంతే త్వరగా విడాకులు... ఆ వెంటనే మరోసారి వెండితెరపై రీఎంట్రీలతో పాటు ఇటీవల ఆమె బెన్స్ ఎస్ క్లాస్ అనే ఖరీదైన లగ్జరీకారుని కొని దాని మీద కట్టాల్సిన ట్యాక్స్‌ని కేరళ ప్రభుత్వానికి ఎగవేసేందుకు ఎంతో పకడ్బందీగా పుదుచ్చేరిలో తన పేరిట ఓ నకిలీ అడ్రస్ ఫ్రూఫ్‌ని తయారు చేయించి కేరళ గవర్నమెంట్‌కి దాదాపు 20 లక్షల పన్ను ఎగ్గొట్టింది. ఏకంగా 1.12కోట్ల విలువ చేసే కారు కొని కేవలం 20లక్షలకు కక్కుర్తి పడి ఆమె ఇలా వ్యవహరించడంపై నాటి పుదుచ్చేరి లెఫ్ట్‌నెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ కూడా తీవ్రంగా స్పందించి ఈ కేసుకు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇటీవలే ఈ కేసు విషయంలో అమలాపాల్ న్యాయస్థానంలో లొంగిపోయింది. కానీ ఇంత జరుగుతున్నా కూడా ఆమె తన తప్పు ఒప్పుకోకపోవడమే కాదు. ఆ 20లక్షలు కట్టేందుకు మాత్రం ససేమిరా అంటోంది. దాంతో ఈ కేసు ఆమె మెడకు బాగా చుట్టుకుంటోంది. తాజాగా ఈ కేసులో త్వరగా చార్జిషీట్లు నమోదు చేయాలని కేరళ ప్రభుత్వం తమ పోలీసులను ఆదేశించింది. గతంలో ఇలాగే కేరళ ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టిన కేసులో నటుడు, రాజ్యసభ సభ్యుడు అయిన సురేష్‌గోపి, నటుడు ఫహద్ ఫజల్‌లపై కూడా కేసులు నమోదయ్యాయి.
ప్రభుత్వం అప్పటికీ పెద్ద మనసు చేసుకుని పన్నులు తిరిగి కట్టేందుకు కాస్త సమయం ఇవ్వగా నటుడు ఫజల్ ఆ డబ్బులను కట్టివేశాడు. కానీ నటి అమలాపాల్, నటుడు, రాజ్యసభ సభ్యుడుగా ఉన్నత స్థానంలో ఉన్న సురేష్‌గోపీలు మాత్రం పన్ను కట్టేందుకు నిరాకరించారు. దీంతో వీరిద్దరిపై కేరళ ప్రభుత్వం కఠినచర్యలు తీసుకోవాలని నిర్ణయంచుకుంది. గోటితో పోయే దానిని గొడ్డలి దాకా తెచ్చుకోవడం అంటే బహుశా ఇదేనేమో..!