మనదేశంలో సనాతనకాలం నుంచి గురుశిష్య సంప్రదాయం వస్తున్న తీరు ప్రపంచదేశాలకు తలమానికంగా ఉంటుందనే చెప్పాలి. మన దేశంలో తల్లిదండ్రులకంటే విద్యాబుద్దులు నేర్పే గురువులకే శిష్యులను శిక్షించి, వారికి ఎలాగైనా విద్యాబ్యాసాలు నేర్పి,వారికి ఉన్నతమైన శిక్షణ అందించే హక్కు ఉంటుంది. కొందరు గురువులైతే తల్లిదండ్రుల కంటే శిష్యులచేత ఇంటి పని, వంట పని వంటివి కూడా చేయిస్తారు. కానీ రానురాను గురుదేవోభవ: అనే విషయంలో అర్ధం మారుతోంది.
మా అబ్బాయిలను మేమే కొట్టం. మరి కొట్టడానికి మీరెవ్వరు అంటూ తల్లిదండ్రులే గురువులకు బంధనాలు విధిస్తున్నారు. బహుశా అలాంటి బాధలోనే మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఉన్నట్లు ఉన్నారు. ఆయన తాజాగా మాట్లాడుతూ.. నేను ఇళయరాజా, కీరవాణి, రాజ్‌కోటి వంటి వారి వద్ద పనిచేశాను. వారి నుంచే ఎంతో నేర్చుకున్నాను. వారిని ఎప్పటికీ నాకు విద్య నేర్పిన గురువులుగానే భావిస్తాను. కానీ నా వద్ద శిష్యరికం చేసిన వారు మాత్రం బయటకు వెళ్లితే నన్ను విపరీతంగా తిడుతున్నారు. వారి తిట్లు నాకు బాధను కలిగిస్తున్నాయి.
ప్రతి విషయంలోనూ పర్‌పెక్షన్ కోరుకునే మనస్తత్వం నాది. ఆ విషయంలో నా దగ్గర పనిచేసేవారికి కోపంతో తిట్టి ఉంటే తిట్టి ఉండవచ్చు. కానీ వారికి విద్యనేర్పేందుకే తిట్టి ఉంటాను గానీ వ్యక్తిగతంగా నాకు ఎవ్వరి మీదా ఎలాంటి కోపం లేదు. కానీ పని విషయంలో మరీ నేను అంత కఠినంగా ఉండటం నా తప్పేమో అని ఇప్పుడు ఈ మాటలను వింటే బాధగా ఉంటోంది. నాదగ్గర పనిచేసిన వారు అలా తిడుతుంటే ఎంతో బాధగా ఉంది. బహుశా పనిలో ఎక్కువగా పర్‌ఫెక్షన్ కోరుకోవడం నాలోని మైనస్ పాయింటేమో అనిపిస్తూ ఉంటుంది అని మణిశర్మ తన ఆవేదనను వెలిబుచ్చారు.