ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం చిత్ర విచిత్రమైన మలుపులు తిరుగుతోంది. చంద్రబాబు నాయుడిది ఒంటరిగా పోటీ చేసే మనస్తత్వం కాదు. అవసరమైతే వామపక్షాలు, కాదంటే వాటి బద్ద విరోధి బిజెపితోనైనా పరిస్థితులకు అనుగుణంగా సర్దుకుపోవడంతో ఆయన సిద్దహస్తుడు. ఆయనకు రాజకీయాలలో ఎవ్వరూ శత్రువులు కాదు... అలాగని ఎవ్వరూ మిత్రులు కారు. కలిసి పోటీ చేస్తాడు. తర్వాత వారి హవా తగ్గిందంటే మరోకరిని చూసుకుంటాడు. తమ వల్లనే ఒక్కసీటు కూడా గెలిచే సత్తా లేని బిజెపి, వామపక్షాలు సీట్లు గెలుచుకున్నాయని చివర్లో మాట మారుస్తారు. దాంతో ఆయనకంటూ నమ్మకమైన మిత్రులు ఎవరు ఉండరు. అలాగే ఆయన నమ్మదగిన స్నేహితుడు కూడా కాదు. ఏ ఎండకాగొడుగు పట్టేరకం. ఇక నిన్నటివరకు ఆయన బిజెపితో కలిసి ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ పొత్తుకి చిల్లు పడింది కాబట్టి ఈ సారి ఆయన పవన్, వామపక్షాలతో కలసి నడుస్తాడని అందరు భావించారు. ఎందుకంటే అవినీతి పరునిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీతో వామపక్షాలు కలవడానికి సిద్దంగా లేవు.
ఇక ఉన్నట్లుండి పవన్ టిడిపికి ఝలక్ ఇచ్చాడు. ఆ పార్టీని ఆయన దుమ్మెత్తిపోస్తున్నాడు. దీనిని చూసిన టిడిపి నాయకులు పవన్, మోదీతో రహస్య స్నేహం చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. కానీ దీనిని వామపక్ష నేతలు నమ్మడం లేదని అర్ధమవుతోంది. వైసీపీ అయినా మోదీతో రహస్యంగా స్నేహం చేస్తోందని అంటే నమ్ముతామని కానీ పవన్‌ది అలాంటి వ్యక్తిత్వం కాదని అంటోంది. ఈ సారి చంద్రబాబు పంచన చేరాల్సిన పనిలేదని, తమకు జనసేన, పవన్ రూపంలో కొత్త మిత్రుడు లభించాడని, సిపిఐ నాయకుడు నారాయణ అంటున్నాడు. మోదీని ఓడిద్దాం.. దేశాన్ని రక్షిద్దాం. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుదాం అనే నినాదాలతో సెప్టెంబర్, అక్టోబర్‌లలో పలు కార్యక్రమాలను నిర్వహించనున్నామని నారాయణ చెప్పుకొచ్చాడు.
ఇక మరోవైపు పవన్‌కి తన మాట మీద తనకే నిలకడ లేనట్లుగా కనిపిస్తోంది. వామపక్షాల వంటి నమ్మకమైన మిత్రులను ఆయన దూరంగా పెడుతున్నాడు. ఓ ఐదారు సీట్లు ఇస్తే సంతృప్తి పడే వామపక్షాలను కాదని ఆయన రాష్ట్రంలోని అన్ని స్థానాలకు ఒంటరిగా పోటీ చేస్తామని చెబుతున్నాడు. ఇప్పటికే పవన్‌కళ్యాణ్‌తో కలిసి కొన్ని కార్యక్రమాలను నిర్వహించాలని వామపక్షాలు ఆశపడుతున్నాయి. కానీ పవన్ మాత్రం తానే ఒంటిరిగా పోరాట యాత్రను చేస్తున్నాడు. జనసేన విడిగా నిలబడితే ఆ పార్టీ ఓట్ల శాతం 6శాతం మాత్రమేనని, ఐదారు సీట్లు తప్ప గెలవలేదని లగడపాటి వంటి వ్యక్తి తన సర్వేలో తేల్చిపారేశాడు. ఇది అందరు ఊహిస్తున్నదే.
మరి ఇలాంటి సమయంలో పవన్ వామపక్షాలతో కలిసి ముందుకు నడిస్తే ఆయనకు సంస్థాగతంగా మంచి పునాదితోపాటు మరికొన్ని సీట్లు అదనంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తద్వారా వామపక్షాలు కూడా నాలుగైదు సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు పోటీపరంగా చూస్తే వచ్చే ఎన్నికల్లో టిడిపి, వైసీపీ, బిజెపి, కాంగ్రెస్, జనసేన వంటి ఐదు పార్టీలు ఎన్నికల్లో నిలబడతాయని క్లారిటీ వచ్చింది. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోయి అది చంద్రబాబుకే కలిసి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.