అసలు కంటే కొసరు ముద్దు అంటారు. అలాగే కొనుక్కుని తినే జామకాయల కంటే దొంగిలించి తినే జామకాయల రుచి అద్భుతంగా ఉంటుందనేది సెలబ్రిటీలు, కోటీశ్వరుల నుంచి సామాన్యుల వరకు నమ్మే నమ్మకం. ఇక విషయానికి వస్తే ఈమద్య రామ్‌చరణ్ నుంచి ఎందరో నటులు నిజానికి ఇతర అన్ని రంగాల కంటే అవినీతి లేని రంగం సినిమా రంగమే అని జబ్బలు చరుచుకుంటున్నారు. కానీ స్టార్స్ తీసుకుంటున్న నిజమైన పారితోషికం ఎంత? వారు కడుతున్న ఇన్‌కంట్యాక్స్ ఎంత అనేవి లెక్కలోకి తీసుకుంటే ఈ సినీ రంగ పెద్దల అసలు భాగోతాలు బయటకి వస్తాయి.
ఇక విషయానికి వస్తే 2010-2011కు గాను హీరోయిన్ త్రిష ఇన్‌కంటాక్స్ కట్టడంలో పలు ఆదాయాలను చూపించలేదు. దాంతో ఐటి శాఖ ఆమె కట్టకుండా ఎగవేసిన 1కోటి 11వేల రూపాయలను అపరాధ రుసుము కింద కట్టాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ దీనిపై త్రిష మద్రాస్ హైకోర్టుని ఆశ్రయించింది. ఈ కేసు పూర్వాపరాలను విచారించిన హైకోర్టు త్రిష ఉద్దేశ్యపూర్వకంగా ఈ మొత్తాన్ని ఎగగొట్టలేదని, ఐటి చట్టం ప్రకారం ఆమె ఐటీ శాఖ పేర్కొన్న అపరాధరుసుంని చెల్లించాల్సిన అవసరం లేదని బెంచ్ తరపున విచారణ చేసిన చీఫ్‌జస్టిస్ ఇందిరా బెనర్జీ తీర్పును చెప్పింది.
మొత్తానికి కోటి రూపాయలకు పైగా తనకు కట్టాల్సిన అవసరం లేదని బెంచ్ తీర్పు చెప్పడంతో త్రిష ఆనందానికి హద్దులు లేవు. ఈ మొత్తంతో ఆమె త్వరలో తన స్నేహితులని గోవా తీసుకెళ్లి మంచి పార్టీ ఇవ్వాలనే ఆలోచనలో ఉందని తెలుస్తోంది.