మన పాలకులు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సంక్రాంతి సంబురాలు, రంజాన్‌తోఫా, క్రిస్మస్ కానుకగా రేషన్‌కార్డు కలిగిన వారికి ప్రత్యేక వంట సరుకులను ఏడాదికి ఒకసారి అందిస్తుంటాడు. అలాగే బాలీవుడ్‌లోని ఖాన్ త్రయమైన షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అమీర్‌ఖాన్‌లు కూడా రంజాన్, క్రిస్మస్, స్వాతంత్య్రదినోత్సవాలు వంటి ప్రాముఖ్యం ఉన్న రోజుల్లో ప్రేక్షకులను తమ చిత్రాల ద్వారా ప్రత్యేక తోఫాలను ఇస్తూ ఉంటారు.
ఈద్ సందర్భంగా ఈ ఏడాది సల్మాన్‌ఖాన్ 'రేస్'తో వస్తుండగా, క్రిస్మస్ కానుకగా షారుక్‌ఖాన్ 'జీరో' చిత్రంతో ముందుకు రానున్నాడు. 'జీరో' చిత్రం ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో షారుఖ్‌ఖాన్ మరగుజ్జుగా కనిపించనున్నాడు. ఇక ఈద్ సందర్భంగా ఈ చిత్రం యూనిట్ స్పెషల్ టీజర్‌ని విడుదల చేశారు. ఇందులో షారుఖ్‌ఖాన్‌తో పాటు సల్మాన్‌ఖాన్ కూడా చిందులు వేయడం ఇద్దరు స్టార్స్ అభిమానులను ఎంతో ఖుషీ చేస్తోంది. షారుఖ్, సల్మాన్‌ల మద్య జరిగే సంభాషణలు, సన్నివేశాలు ఎంతగానో అలరిస్తున్నాయి. ఇవి చాలా సరదాగా ఉన్నాయి. ఈ ఇద్దరు కలిసి చేసే డ్యాన్స్‌లు, స్టెప్స్ అయితే అందరికీ మురిపిస్తున్నాయి.
మరో విశేషం ఏమిటంటే ఈ డ్యాన్స్‌లో మరుగుజ్జుగా ఉండే షారుఖ్‌ఖాన్ సల్మాన్‌ఖాన్ చంకెక్కి ఆయన బుగ్గలపై ముద్దులు పెట్టేస్తాడు. ఈ షాట్ అభిమానులను ఫిదా చేస్తోంది. ఇందులో షారుఖ్‌ఖాన్ సరసన కత్రినా కైఫ్, అనుష్కశర్మ ఇద్దరు నటిస్తున్నారు. మరి డిసెంబర్ 21న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో వేచిచూడాల్సివుంది. మరో ముఖ్య విశేషం ఏమిటంటే రెండు మూడేళ్ల ముందట సల్మాన్‌కి; షారుఖ్‌కి మద్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. అలాంటి ఈ ఇద్దరు ఇంత త్వరగా కలిసి పోవడం ఆయా హీరోల అభిమానులకు ఆనందదాయకమేనని చెప్పాలి.