సాధారణంగా బయోపిక్‌లను తీయాలంటే ఎంతో అనుభవం ఉండాలని, ఆయా బయోపిక్ వ్యక్తుల చరిత్రను స్వయంగా చూసి ఉంటేనే వాటిని జనరంజకంగా తీయడం సాధ్యమని, బయోపిక్ అనేది ఓ సవాల్ అనే అభిప్రాయం అందరిలో బలంగా ఉంది. కానీ మహానటి సావిత్రి బతికున్నప్పుడు పుట్టి ఉన్నారో లేదో కూడా తెలియని నాగ్‌అశ్విన్, ప్రియాదత్, స్వప్నదత్‌లు 'మహానటి' బయోపిక్ ద్వారా దానిని తప్పని నిరూపించారు. కేవలం ఒకేఒక్క చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' వంటి పెద్దగా అనుభవం లేని నాగ్‌అశ్విన్ ఆ చిత్రాన్ని కళ్లకు కట్టినట్లు చూపించి ఘనవిజయం సాధించాడు.
ఇక బాలకృష్ణ చేస్తున్న తన తండ్రి బయోపిక్ 'ఎన్టీఆర్'ని కూడా కేవలం వేళ్ల మీద లెక్కించదగ్గ చిత్రాలను మాత్రమే డైరెక్ట్ చేసిన క్రిష్ హ్యాండిల్ చేయనున్నాడు. ఇక 'ఆనందోబ్రహ్మ' వంటి ఒకే ఒక్క చిన్న చిత్రం తీసిన మహి.వి.రాఘవ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బయోపిక్‌ని తీస్తున్నాడు. ఇప్పటికే ఇందులో వైఎస్ పాత్రను సహజంగా ఏ చిత్రమంటే దానిని ఒప్పుకోడనే పేరున్న మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టిని ఒప్పించాడు. వైఎస్ భార్య విజయమ్మ పాత్రలో 'బాహుబలి'లో అనుష్క వదినగా నటించిన ఆశ్రిత వేముగంటి చేస్తోంది. షర్మిల పాత్రకు భూమికను అడిగారని వార్తలు వచ్చినా దీనిని భూమిక ఖండించింది. మహి వి రాఘవ కూడా ఈ చిత్రంలో షర్మిల పాత్ర ఉండదని తేల్చిచెప్పాడు. ఇక వైఎస్ అనుచరుడు సూరీడు పాత్రలో పోసాని కృష్ణమురళి, వైఎస్ ఆత్మ కెవిపిరామచంద్రరావు పాత్రలో రావు రమేష్‌లు నటిస్తున్నారని సమాచారం.
వైఎస్ జీవితంలో అతి ముఖ్యమైన ఘట్టం ఆయన చేసిన పాదయాత్ర. దాంతో ఈ చిత్రానికి కూడా 'యాత్ర' అనే టైటిల్‌ని ఫిక్స్ చేశారు. టైటిల్‌తో కూడిన మమ్ముట్టి వైయస్ గెటప్ అచ్చు వైఎస్‌లానే ఉన్నాడని ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక వైఎస్ రాజకీయ రంగం విషయంలో తెలంగాణకు చెందిన నాటి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిది కూడా కీలకమైన పాత్ర. వైఎస్ ఏ పని చేయాలన్నా సబితాకి చెందిన చేవెళ్ల నుంచే చేసేవాడు. ఈ పాత్ర కోసం సీనియర్ నటి సుహాసినిని తీసుకున్నారట. ఈమద్య సరైన పాత్రలు రాకపోవడం వల్లనేమో సుహాసిని పెద్దగా చిత్రాలలో కనిపించడం లేదు. ఈ చిత్రంలో ఆమెది కీలకపాత్ర కావడంతో ఓకే చేసిందని సమాచారం.