మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌గా విజయశాంతితో ఆయన కలిసి నటించిన 'గ్యాంగ్‌లీడర్'ని చెప్పుకోవాలి. మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాతగా, విజయబాపినీడు దర్శకత్వంలో బప్పిలహరి సంగీతం అందించిన ఈ చిత్రం 1991లో విడుదలై రికార్డులను తిరగరాసింది. ఇక విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో 'అభిలాష, చాలెంజ్, రాక్షసుడు, మరణమృదంగం' వంటి ఎన్నో చిత్రాలను నిర్మించిన సీనియర్ నిర్మాత, క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.యస్.రామారావు ఒకరు. చిరు మెగాస్టార్ కావడంలో ఈయనతో పాటు కోదండరామిరెడ్డి భాగస్వామ్యం కూడా ఉంది. కానీ యండమూరి వీరేంద్రనాథ్ దర్శకత్వంలో వచ్చిన 'స్టువర్ట్‌పురం పోలీస్‌స్టేషన్' ఫ్లాప్ తర్వాత వీరి కాంబో మరలా రాలేదు. ఈ విషయంలో తనదే తప్పని చిరంజీవి తాజాగా 'తేజ్ ఐలవ్‌యు' వేడుకలో చెప్పాడు. అంతేకాదు.. త్వరలో రామ్‌చరణ్‌తో కె.యస్.రామారావు చిత్రం చేయనున్నాడని ప్రకటించాడు.
తాజా ఫిల్మ్‌నగర్ సమాచారం ప్రకారం ఈ చిత్రం 'గ్యాంగ్‌లీడర్'కి రీమేక్‌గా రూపొందనుందని వార్తలు వస్తున్నాయి. అదే కథ, టైటిల్‌తో నేటి జనరేషన్‌కి తగ్గట్లు మార్పులు చేర్పులు చేసి దీనిని తీయనున్నారట. దర్శకుడి ఎంపిక తర్వాత ఈ విషయంలో క్లారిటీ రానుంది. ప్రస్తుతం రామ్‌చరణ్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తున్నాడు. ఆ వెంటనే ఆయన రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌తో కలిసి నటించే మల్టీస్టారర్ చేస్తాడు. వాటి తర్వాతనే కె.యస్.రామారావు చిత్రం ఉంటుంది. మరోపక్క కె.యస్.రామారావు ప్రస్తుతం మెగా మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో కరుణాకరన్ దర్శకత్వంలో 'తేజ్ ఐ లవ్‌యు' చిత్రం నిర్మించాడు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది.
కానీ చిరంజీవి వేడుకకు వచ్చినా ఈ చిత్రంపై ఎలాంటి బజ్‌లేదు. వరుసగా ఐదు ఫ్లాప్‌ల వల్ల కూడా తేజు విషయంలో బిజినెస్ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఈ చిత్రం బిజినెస్ జరగాలంటే త్వరలో కె.యస్.రామారావు-రామ్‌చరణ్ కాంబినేషన్‌ని ప్రకటించి, 'తేజ్ ఐ లవ్‌యు' చిత్రం తీసుకుంటే చరణ్ చిత్రం కూడా తమకే వస్తుందని బయ్యర్లను ట్రాప్‌లోకి దించే ప్రయత్నమే ఇదని కూడా వార్తలు వస్తున్నాయి.