తెలుగు వాడైనప్పటికీ తమిళంలో తన సత్తా చాటుతున్న హీరో విశాల్. ఈయన తమిళనాడు నిర్మాతల మండలి అధ్యక్షునిగానే గాక, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా తమిళ చిత్రసీమలోని లోపాలపై దృష్టి పెట్టి అద్భుతమైన పనితీరుని చూపిస్తున్నాడు. సినిమా పైరసీ, పైరసీ వెబ్‌సైట్లు, సినిమా టిక్కెట్లలో ఒక రూపాయిని రైతు సంక్షేమ నిధికి ఇవ్వడం, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు, ముఖ్యంగా చెన్నై వరదల సమయంలో నీటిలో స్వయంగా ఈతకొట్టు కుంటూ చేసిన సహాయచర్యలు, 'మెర్శల్' విషయంలో కేంద్రంపై ఘాటు వ్యాఖ్యలు, 'కాలా'ని కర్ణాటకలో బ్యాన్ చేయడం, నడిగర్ సంఘం బిల్డింగ్, కళ్యాణమండపం వంటి పలు కార్యక్రమాల ద్వారా తన వంతు కృషి చేస్తున్నాడు. తాజాగా ఆయన నటించిన 'అభిమన్యుడు' చిత్రం హిట్ టాక్ తెచ్చుకుని తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ చిత్రం విషయంలో కూడా టిక్కెట్‌పై ఒక రూపాయిని తెలుగు రైతుల కోసం ఆయన కేటాయించాడు.
ఇక ఈయన తాజాగా శ్రీరెడ్డి విషయంపై స్పందించాడు. నాని ఎలాంటి వాడో నాకు తెలుసు. ఆయన నాకు మంచి స్నేహితుడు. ఆడవారి పట్ల ఎంతో గౌరవంగా ఉంటాడు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల నేను నానికి పూర్తి మద్దతును తెలుపలేకపోతున్నాను. సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందనేది నిజం. తెలుగు, తమిళ భాషల్లో కొందరు తమకు తాముగా నిర్మాతలుగా చెప్పుకుంటూ ఆడిషన్స్ పేరుతో ఆడవారిని మోసం చేస్తున్నారు. ఒకవేళ శ్రీరెడ్ది ఆరోపణల్లో నిజం ఉంటే పేర్లు చెప్పడం కాదు.. ఆధారాలు బయటపెట్టాలి. ఆమె వ్యవహారశైలిని బట్టి చూస్తే ఇతరులను ఆమె ఇష్టం వచ్చినట్లుగా టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది. మున్ముందు నన్ను టార్గెట్ చేసినా చేస్తుంది.
మనదేశంలో లైంగిక వేధింపుల పరిష్కారానికి సరైన చట్టాలు లేవు. ఏ మహిళ అయినా ఆరోపణలు చేస్తే దానినే పరిగణనలోకి తీసుకుని, చట్టం ఆరోపణలు చేసిన వారికి మద్దతుగా ఉంటోందే తప్ప నిజానిజాలను పట్టించుకోవడం లేదు అని చెప్పుకొచ్చాడు. నిజంగానే ఇది అక్షరసత్యం. ఆడవారి తప్పు ఉన్నా కూడా ఎవరైనా మహిళ ఆరోపణలు చేస్తే ఎవరిది నిజం? ఎవరిది అబద్దం అని ఆలోచించకుండా చట్టాలన్నీ మహిళకే అనుకూలంగా ఉన్నాయి తప్ప వేధింపులకు గురైన మగవారికి మాత్రం రక్షణ లేకుండా పోతోంది.