చిన్నారులకు పౌష్టికాహారంగా పాలు, గుడ్డు తప్పనిసరిగా తినాలని, చిన్నతనంలో ఈ పలు పోషక విలువలు ఉండే వీటివల్లే పిల్లలు పెద్దయినతర్వాత ఆరోగ్యంగా ఉంటారన్న విషయం తెలిసిందే. ఇక చిన్నారులకు పాలంటే పెద్దగా పడదు. పాలను తాగడానికి వారు నానా హంగామా చేసి తాగకుండా తప్పించుకుంటూ ఉంటారు. కానీ తమ పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే తల్లిదండ్రులు పిల్లల చేత చదువులో 'బాలశిక్ష' చదివించినట్లు, మరికొందరు తల్లిదండ్రులు పాలశిక్షను కూడా విధిస్తారు.
ఇక విషయానికి వస్తే యంగ్‌టైగర్ ఎన్టీఆర్ సోషల్‌మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉంటున్నాడు. ఈమధ్య మరింత యాక్టివ్‌గా ఆయన పోస్ట్‌లు చేస్తున్నాడు. ఎన్టీఆర్-లక్ష్మీప్రణతి దంపతులకు ఆల్‌రెడీ అభయ్‌రామ్ అనే బుల్లి యంగ్‌టైగర్ ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఎన్టీఆర్ తన కుమారుడు అభయ్‌రామ్, తల్లి లక్ష్మీప్రణతిలతో కూడిన ఓ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టి ఫన్నీ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. ఇందులో చిన్నారి అభయ్‌రామ్ తల్లివైపు భయంగా చూస్తూ ఇష్టం లేకపోయినా కూడా బలవంతంగా పాలు తాగుతున్నట్లు కనిపిస్తే, పాలు తాగకపోతే నీ సంగతి చూస్తా? అన్నట్లుగా అమ్మ లక్ష్మీప్రణతి ఉంది.
దీని గురించి ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ, అభయ్‌రామ్ రోజు తాగాల్సిన పాలు కోటా విషయంలో వాడిని వాళ్ల అమ్మ నుంచి కాపాడలేం అని తెలిపాడు. ఈ సరదా ట్వీట్‌కి వెన్నెలకిషోర్ స్పందించి ఆయన కూడా సరదాగా 'క్యూట్‌నెస్ ఓవర్‌లోడెడ్'అని చెప్పాడు. ఇక ఎన్టీఆర్‌లాగా పెద్దయిన తర్వాత సిక్స్, ఎయిట్ ప్యాకులతో కండలు పెంచాలంటే అభయ్‌రామ్‌కి పాలు తాగడం తప్పదనే చెప్పాలి...!