సినిమా పరిశ్రమ డబ్బుతో పాటు పేరును, గౌరవాన్ని అన్నింటిని అందిస్తుంది. కానీ నాడు సంపాదించిన పేరు, నాటి కెరీర్ బిజీగా ఉన్న సమయంలో సంపాదించిన మొత్తాలను జాగ్రత్తగా కూడ బెట్టుకోవడం ముఖ్యం. ఎందుకంటే హీరోయిన్ల కెరీర్‌లు ఎప్పుడు ఎక్కడ ఫేడవుట్ అవుతాయో ఎవ్వరూ చెప్పలేరు. ఈ విషయంలో నేటి తరం నటీమణులు బాగానే ముందు చూపుతో వ్యవహరిస్తున్నారు. తాము సంపాదించిన సొమ్మును ఇతర రంగాలలో పెట్టుబడులు పెడుతూ ఒకటికి పందింతలు లాభం వెనకేసుకుంటున్నారు. కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడే మంచి భవంతులు, స్థలాలు కొంటున్నారు.
కానీ నాటి సావిత్రి నుంచి ఎందరో ఇతర మార్గాలలో పయనించి డబ్బును, ఆరోగ్యాన్ని కూడా కోల్పోయి., ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతున్నారు. తమిళంలో మంచి పేరున్న నిన్నటితరం హీరోయిన్ ఛార్మిళ. ఈమె తాజాగా మాట్లాడుతూ, నా కెరీర్‌లో సంపాదించినదంతా పోగొట్టుకున్నాను. ఇప్పుడు నాకంటూ ఏమి లేదు. దర్శక నిర్మాతలు వేషాలు ఇచ్చి ఆదుకోండి అని కన్నీరు పెట్టుకుంటోంది. నేను ధనవంతుల ఇంట్లో పుట్టి పెరిగినా కొన్ని అనూహ్యమైన పరిస్థితులు నా జీవితంలో ఎదురయ్యాయి. ఇప్పుడు నా వద్ద డబ్బులేదు.. ఆరోగ్యం కూడా లేదు. ఇంతకు ముందే ఈ పరిస్థితి వచ్చి ఉంటే ఆత్మహత్య చేసుకుని ఉండే దానిని. కానీ ఇప్పుడు ఆ పని చేయలేను.
నా తల్లి మంచంలో ఉంది. కుమారుడిని చూసుకోవాల్సి వుంది. ఒక కాలంలో మంచి చిత్రాలు చేశాను. కానీ ఇప్పుడు ఏ దర్శకనిర్మాతలు కూడా నాకు అవకాశాలు ఇవ్వడం లేదు. నటించడానికి అవకాశాలు ఇవ్వండి. ముందు జాగ్రత్తగా భవిష్యత్తు కోసం డబ్బులు దాచకపోవడం నాతప్పు. సినిమాలలో ముమ్మరంగా నటించేటప్పుడు ఆడంబర జీవితాన్ని అనుభవించాను. స్టార్ హోటళ్లలో కాలు వేసి కాలు తీసే దానిని కాదు. సంపాదించిన డబ్బులో అంతా విదేశాలకు జాలీగా వెళ్లడానికే ఖర్చుచేశాను. వివాహానంతరం నాజీవితం తల్లకిందులైంది. ఇంటిని, స్థిరాస్థులను అమ్మివేశాను. నేను చేసిన మరో తప్పు ఇంటిని అమ్మేయడం. ఆ ఇల్లు నాకు ఎంతో ఆత్మస్థైర్యాన్ని అందించింది. ఇలాంటి ఇల్లు పోయిన తర్వాత మానసికంగా, శారీరకంగా బాగా కృంగిపోయాను. అవకాశాలు ఇచ్చి ఆదుకోండి.. అంటూ తన వేదనను ఆమె మీడియాకు తెలిపింది.