కరికాలుడు అలియస్ 'కాలా' అంటే మాటలు కాదు. ఆయన చిత్రం విడుదల తేదీని బట్టి బాలీవుడ్ నుంచి దేశ విదేశాలలోని పలు చిత్రాల తేదీలను నిర్ణయిస్తారు. ఇక 'కబాలి'తో పోల్చుకుంటే 'కాలా' ఆయన అభిమానులను బాగానే అలరిస్తోంది. రజనీ ఈ చిత్రంలో కూడా తన స్టైల్‌తో మెస్మరైజ్ చేశాడు. కానీ రజనీలోని ఈకోణాన్ని పూర్తిగా వినియోగించుకోవడంలో దర్శకుడు రంజిత్‌పా ఈసారి కూడా విఫలం అయ్యాడు. దాంతో ఈ చిత్రానికి డివైడ్ టాక్ వచ్చింది. అయినా ఈ చిత్రం చెన్నైలో మొదటిరోజు విజయ్ 'మెర్సల్' కలెక్షన్లను దాటి తన పేరు మీద రికార్డును లిఖించుకున్నాడు. అయినా ఈ చిత్రానికి రాబోయే '2.0'కి అసలు క్రేజ్ దృష్ట్యా ఏమాత్రం ప్రభావం ఉండదనే చెప్పాలి. రజనీ రాజకీయాలలోకి వస్తున్నానని చెప్పిన తర్వాత విడుదలైన మొదటి చిత్రం 'కాలా' కావడం విశేషం. అయితే ఈ చిత్రానికి ఎన్నో ఆటంకాలు వచ్చాయి.
తమిళనాడులోని తూతుకుడిలో కాల్పుల అనంతరం మరణించిన వారి కుటుంబాలను పరామర్శించడానికి వెళ్లిన రజనీ నోరు అదుపు తప్పి కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ప్రతి విషయానికి పోరాటాలు చేస్తే చివరకు తమిళనాడు స్మశానంగా మారుతుందని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజలకు, రాజకీయ పార్టీలకు, నాయకులకు ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇక కావేరి జలాల మేనేజ్‌మెంట్ బోర్డ్ కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు కన్నడిగుల ఆందోళనలకు గురయ్యాయి. దీంతో కోర్టు తీర్పు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి విజ్ఞప్తి, పోలీసుల రక్షణల మధ్య కూడా 'కాలా' చిత్రం కర్ణాటకలో విడుదల కాలేదు. ఇక మరోవైపు ఈ చిత్రం ప్రీమియర్‌షోని చూసిన ఓ సింగపూర్ వాసి చిత్రం విడుదలైన సాయంత్రమే 45 నిమిషాల సినిమాను ఆన్‌లైన్‌లో పెట్టాడు. తర్వాత అయన్ను అరెస్ట్ చేశారు.
ఇక ఈ చిత్రం విడుదలైన రెండో రోజునే దాదాపు 400వెబ్‌సైట్లలో ఈ చిత్రం పైరసీ ప్రింట్లను పెట్టారు. 'కాలా' తలుచుకుని వెంటనే ఆ 400 వెబ్‌సైట్లను మూత వేయించాడు. ఇక 'కాలా' పైరసీపై కూడా ఫిల్మ్‌చాంబర్ గట్టిగా వార్నింగ్‌లు ఇస్తోంది. ఎవరైనా పైరసీ చేస్తే జైలుకు వెళ్లడం ఖాయమని హెచ్చరించింది. ఇలా చూసుకుంటే కాలాకి అడుగడుగునా ఆటంకాలే వచ్చాయని, మరి వాటిని దాటి రజనీ ఎంత వరకు దూసుకెళ్తాడో వేచిచూడాల్సివుంది..!