'ఆఫీసర్' చిత్రం విడుదలకు ముందే జనాలకు వర్మలో సరుకు అయిపోయిందని అర్ధమైంది. కానీ సినిమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకునే నాగార్జున ఆయనతో 'ఆఫీసర్' చిత్రం చేస్తుండటంతో కొందరు వర్మపై నమ్మకాన్ని మిణుకు మిణుకు అనుకూంటూ ఆశపడ్డారు. కానీ 'ఆఫీసర్' విడుదలైన తర్వాత వర్మ దీపం పూర్తిగా ఆరిపోయింది. భవిష్యత్తులో కూడా ఇది ఇక వెలుగుతుందనే ఆశ ఎవరిలో లేదు. ఇక 'ఆఫీసర్' చిత్రం సమయంలోనే అక్కినేని అఖిల్ నటించే నాలుగో చిత్రానికి తానే దర్శకత్వం వహిస్తానని వర్మ చెప్పాడు. కానీ ఈ విషయంలో నాగార్జున-అఖిల్‌లు మాత్రం నోరు విప్పలేదు.
ఇక తాను ఖచ్చితంగా అఖిల్ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తానని, 'ఆఫీసర్' విడుదల ముందు కూడా వర్మ కుండ బద్దలు కొట్టాడు. కానీ 'ఆఫీసర్' చిత్రం చూసిన తర్వాత అఖిల్‌కు వర్మతో చిత్రం వద్దని అక్కినేని ఫ్యాన్స్ బతిమాలుతూ, ట్వీట్స్ పెట్టారు. చిట్ట చివరకు తాజాగా అక్కినేని అఖిల్ మాట్లాడిన విధానం చూస్తే వర్మతో ఆయన చిత్రం చేయడం లేదని స్పష్టమవుతోంది. ఇది వర్మకి బ్యాడ్ న్యూస్ అయినా అక్కినేని ఫ్యాన్స్‌కి మాత్రం స్వీట్ న్యూసేనని చెప్పాలి.
తాజాగా అఖిల్ మాట్లాడుతూ, ప్రస్తుతం నా దృష్టి మొత్తం వెంకీ అట్లూరితో చేయబోయే చిత్రం మీదనే ఉంది. తదుపరి చిత్రం గురించి ఏమీ ఆలోచించడం లేదు. అభిమానులకు నచ్చిన చిత్రాలు చేస్తూ వారిని సంతోష పరచడమే నా ముందున్న కర్తవ్యం అని చెప్పుకొచ్చాడు. దాంతో అఖిల్ ఇన్‌డైరెక్ట్‌గా వర్మతో చిత్రం ఉండదని తేల్చిచెప్పినట్లే. ఇక అఖిల్ వెంకీ అట్లూరి చిత్రం కోసం త్వరలో లండన్ వెళ్లనున్నాడు. ఈ చిత్రానికి 'మిస్టర్ మజ్ను' అనే టైటిల్‌ని పరిశీలిస్తున్నారు. గతంలో వర్మ నిర్మాతగా కూడా నాగచైతన్యకి 'బెజవాడ' అనే చిత్రం చేయడం, దాని ఫలితం అందరికీ తెలిసిన విషయమేనని చెప్పాలి.